మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా.. ఇంటి లోన్ తీసుకోవాలి.. అనుకుంటున్నారా.. అయితే మీకు భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) శుభవార్తను తెలియజేసింది. బ్యాంకు లోన్ తీసుకునే వారికి ఊరట కలిగిస్తూ స్టేట్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇంటికి రుణాలు తీసుకునే వారి కోసం లోన్ పై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు తెలిపింది. మనం ఎంత లోన్ తీసుకున్నామనే విషయం గురించి కాకుండా గృహ రుణాలపై తమ కస్టమర్లకు స్టేట్ బ్యాంక్ కేవలం 6.70 శాతం వడ్డీతో రుణాలను ఇవ్వనుంది.
అయితే కస్టమర్ల క్రెడిట్ స్కోర్ ఆధారంగా లోన్ మంజూరు చేయనున్నారు. మనం ఎంత పెద్ద మొత్తంలో లోన్ తీసుకున్నా ఇదే వడ్డీ శాతం అమలులోకి వస్తుంది. ఇప్పటి వరకు గృహ రుణాలు రూ.75 లక్షల వరకు తీసుకున్న వారు ఏకంగా 7.15 శాతం వడ్డీని చెల్లించాల్సి వస్తోంది. అయితే ప్రస్తుతం అదే మొత్తంలో లోన్ తీసుకున్నప్పటికీ కేవలం 6.70 శాతం మాత్రమే వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.
ఈ విధమైన రుణ సదుపాయం పొందడం కోసం ఉద్యోగులు, వ్యాపారం చేసే వారు అర్హులేనని స్టేట్ బ్యాంక్ ప్రకటించింది. ఇలా స్టేట్ బ్యాంకు తీసుకున్న ఈ నిర్ణయంతో 30 సంవత్సరాలలోపు గృహ రుణం తీసుకున్న కస్టమర్ సుమారుగా రూ.8 లక్షల వరకు లబ్ధి పొందవచ్చని స్టేట్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సి.ఎస్ శెట్టి తెలిపారు. స్టేట్ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఎంతో మంది కస్టమర్లకు ప్రయోజనం కలుగుతుందని చెప్పవచ్చు.