స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు డెబిట్ కార్డు పరంగా సురక్షితమైన సదుపాయాలను అందిస్తుందని చెప్పవచ్చు. డెబిట్ కార్డులను వాడే అనేక చోట్ల పిన్‌ను ఎంటర్ చేయాలి. దీంతో ఖాతాదారుల అకౌంట్లకు రక్షణ లభిస్తుంది. అయితే పిన్ నంబర్‌ను మర్చిపోయినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. వెంటనే సులభంగా జనరేట్ చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే…
ఎస్ఎంఎస్ ద్వారా
ఎస్‌బీఐ డెబిట్ కార్డు పిన్‌ను ఎస్ఎంఎస్ ద్వారా జనరేట్ చేయవచ్చు. అందుకు ఇలా చేయాలి. PIN అని టైప్ చేసి డెబిట్ కార్డు చివరి 4 అంకెలను ఎంటర్ చేయాలి. మళ్లీ స్పేస్ ఇచ్చి మీ ఎస్‌బీఐ అకౌంట్ నంబర్‌లో చివరి నాలుగు అంకెలను ఎంటర్ చేయాలి. అంటే PIN (XXXX) (YYYY) అని మెసేజ్ టైప్ చేయాలి. XXXX అనేది డెబిట్ కార్డు చివరి నాలుగు అంకెలు. YYYY అనేది అకౌంట్ నంబర్ చివరి నాలుగు అంకెలు. తరువాత ఆ మెసేజ్‌ను 567676కు పంపించాలి. దీంతో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎస్‌బీఐ ఏటీఎంలో 2 రోజుల్లోగా ఉపయోగించాలి. అక్కడ ఈ ఓటీపీ ద్వారా కొత్త పిన్‌ను జనరేట్ చేయవచ్చు.
ఐవీఆర్ఎస్ ద్వారా
1800 112 211, 1800 425 3800, 080-26599990 లలో ఏదైనా నంబర్‌కు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి కాల్ చేయాలి. తరువాత ఐవీఆర్ఎస్ వినిపిస్తుంది. అందులో 2 నంబర్‌ను ప్రెస్ చేయాలి. దీంతో ఏటీఎం, డెబిట్ కార్డుల సర్వీస్‌కు ఐవీఆర్ఎస్ వెళ్తుంది. అక్కడ ఎస్‌బీఐ ఏటీఎం పిన్‌ను జనరేట్ చేసేందుకు 1 నొక్కాలి. మీరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి కాల్ చేయకపోతే 2 నొక్కాలి. తరువాత ఏటీఎం కార్డు చివరి 5 అంకెలను అడుగుతుంది. అవి ఎంటర్ చేశాక నిర్దారించేందుకు 1 నొక్కాలి. అనంతరం 2 నొక్కాలి. మళ్లీ ఏటీఎం కార్డు చివరి 5 అంకెలను ఎంటర్ చేయాలి. అనంతరం అకౌంట్ నంబర్‌లో చివరి 5 అంకెలను ఎంటర్ చేసి 1 నొక్కాలి. తరువాత 2 నొక్కి అవే అంకెలను మళ్లీ ఎంటర్ చేయాలి. తరువాత పుట్టిన తేదీ అడుగుతుంది. ఎంటర్ చేయాలి. ఈ క్రమంలో ఎస్‌బీఐ డెబిట్ కార్డు పిన్ విజయవంతంగా జనరేట్ అవుతుంది. ఆ వివరాలు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వస్తాయి. 24 గంటల్లోగా సమీపంలోని ఎస్‌బీఐ ఏటీఎంను సందర్శించి అక్కడ ఆ పిన్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలా కొత్త పిన్‌ను జనరేట్ చేయవచ్చు.