అహ్మదాబాద్‌లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 26వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విఫలమైంది. ఎప్పటికప్పుడు వికెట్లను కోల్పోతూ వచ్చిన బెంగళూరు చివరకు చేతులెత్తేసింది. దీంతో బెంగళూరుపై పంజాబ్ 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా పంజాబ్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ కేఎల్ రాహుల్, క్రిస్ గేల్‌లు అద్భుతంగా రాణించారు. 57 బంతుల్లో రాహుల్ 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 91 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, 24 బంతుల్లో గేల్ 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు. బెంగళూరు బౌలర్లలో కైలీ జేమిసన్ 2 వికెట్లు తీయగా, డానియెల్ శామ్స్, యజువేంద్ర చాహల్, షాబాజ్ అహ్మద్‌లకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెంగళూరు బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ కోహ్లి, రజత్ పటిదార్, హర్షల్ పటేల్‌లు ఫర్వాలేదనిపించారు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. 34 బంతులు ఆడిన కోహ్లి 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 35 పరుగులు చేయగా, పటేల్ 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేశాడు. అలాగే పటిదార్ 30 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 31 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 3 వికెట్లు పడగొట్టగా, రవి బిష్ణోయ్ 2 వికెట్లు తీశాడు. రైలీ మెరెడిత్, మహమ్మద్ షమీ, క్రిస్ జోర్డాన్‌లకు తలా 1 వికెట్ దక్కింది.