ఢిల్లీలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 27వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టన్నింగ్ విక్టరీ సాధించింది. చివరి ఓవర్ వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. చివరి రెండు బంతుల్లో పొల్లార్డ్ విజృంభించాడు. దీంతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా చెన్నై బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో అంబటి రాయుడు, డుప్లెసిస్, మొయిన్ అలీలు అద్భుతంగా రాణించారు. 27 బంతుల్లోనే రాయుడు 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, మొయిన్ అలీ 36 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. డుప్లెసిస్ 28 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో కిరన్ పొల్లార్డ్ 2 వికెట్లు తీయగా, బుమ్రా, బౌల్ట్‌లకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై చివరి బంతికి లక్ష్యాన్ని ఛేదించింది. 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ముంబై బ్యాట్స్‌మెన్లలో పొల్లార్డ్ అద్భుతంగా రాణించాడు. 34 బంతుల్లోనే 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. డికాక్, రోహిత్ శర్మలు 38, 35 పరుగుల చొప్పున సాధించారు. చెన్నై బౌలర్లలో శామ్ కుర్రాన్ 3 వికెట్లు పడగొట్టగా, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, మొయిన్ అలీలకు తలా 1 వికెట్ దక్కింది.