కోవిడ్ మహమ్మారి ఇప్పటికే ఎన్నో లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ఆత్మీయులను దూరం చేసింది. కన్నవాళ్లను, కుటుంబ సభ్యులను, స్నేహితులను పోగొట్టుకున్న ఎంతో మంది తీవ్ర విషాదంలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ మెడికల్ ఆఫీసర్ మరణం కూడా తీవ్ర విషాదాన్ని నింపింది. ఏడాది కాలంగా ఎంతో మంది కోవిడ్ పేషెంట్లు రికవరీ అయ్యేందుకు ఆయన సహాయం చేశారు. కానీ చివరకు మాయదారి మహమ్మారి ఆయననూ బలి తీసుకుంది. తనపైనే ఆధార పడ్డ కుటుంబ సభ్యుల జీవితాలను ఆగం చేసింది.
ఢిల్లీలోని లోక్ నాయక్ హాస్పిటల్‌లో రాజ్ కుమార్ అగర్వాల్ (38) మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. గతేడాది కరోనా మొదటి వేవ్ సమయంలో తీవ్రంగా శ్రమించాడు. ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా మరోసారి అలుపెరగకుండా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇప్పటికే ఎంతో మంది కోవిడ్ రోగులను కోలుకుని ఇంటికి పంపించాడు. కానీ అతనికి, అతని భార్యకు ఏప్రిల్ 11వ తేదీన కరోనా సోకింది. దీంతో అతను కొన్ని రోజుల పాటు ఇంట్లోనే ఉండి కోవిడ్ చికిత్స తీసుకున్నాడు.
అయితే సడెన్‌గా రాజ్ కుమార్‌కు ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో అతన్ని హాస్పిటల్‌లో చేర్పించారు. చేయాల్సిన చికిత్సను అంతా అందించారు. అయినప్పటికీ రాజ్ కుమార్ బతకలేదు. గత గురువారం ఉదయం 5 గంటలకు అతను మృతి చెందాడు. దీంతో అతని కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
రాజ్ కుమార్ భార్యకు కూడా కోవిడ్ పాజిటివ్ కావడంతో అతని ఇద్దరు పిల్లలను మరో కొలీగ్ చేరదీసి ఇంట్లో పెట్టుకున్నాడు. అయితే రాజ్ కుమార్ మరణించిన విషయం ఆ పిల్లలకు ఇంకా తెలియదు. వారు ఇప్పటికీ తమ నాన్న బతికే ఉన్నాడని, హాస్పిటల్‌లో ఉన్నాడని, తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఆ కుటుంబంలో సంపాదించేది రాజ్ కుమార్ ఒక్కడే. దీంతో అతనిపై ఆధార పడ్డ భార్య పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గతంలో అతను కొందరు స్నేహితులకు ఎంతగానో సహాయం చేశాడు. దీంతో వారు అతని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.
అయితే రాజ్ కుమార్ తన చివరి క్షణాల్లో తన కొలీగ్స్‌తో మాట్లాడాడు. తనను ఎలాగైనా బతికించాలని అతను వేడుకున్నాడు. అతని మాటలను విన్న కొలీగ్స్ అందుకు దుఃఖించారు. నిజంగా ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదని వారు కోరుకుంటున్నారు. మాయదారి మహమ్మారి ఇంకా ఎంత మంది జీవితాలను ఇలా చిన్నా భిన్నం చేస్తుందో ఆ భగవంతుడికే తెలియాలి.