ముంబైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 11వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ ఉంచిన లక్ష్యాన్ని ఢిల్లీ అలవోకగా ఛేదించింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్ అద్భుతంగా రాణించారు. ఈ క్రమంలో పంజాబ్‌పై ఢిల్లీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా పంజాబ్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్లలో మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్‌లు అద్భుతంగా రాణించారు. 36 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్సర్లతో అగర్వాల్ 69 పరుగులు చేయగా, 51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో రాహుల్ 61 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ వోక్స్, లుక్‌మన్ మెరివాలా, కగిసో రబాడా, అవేష్ ఖాన్‌లకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ 18.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. శిఖర్ ధావన్, పృథ్వీ షాలు ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చారు. 49 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో ధవాన్ 92 పరుగులు చేయగా, 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో షా 32 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో జై రిచర్డ్‌సన్ 2 వికెట్లను తీయగా, అర్షదీప్ సింగ్, రైలీ మెరెడిత్‌లకు చెరొక వికెట్ దక్కింది.