చెన్నైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 13వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని ఢిల్లీ సునాయాసంగానే ఛేదించింది. లక్ష్యం తక్కువే అయినా పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా లేకపోవడంతో ఢిల్లీ ఆచి తూచి ఆడుతూ వికెట్లను కాపాడుకుంటూ లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ మినహా ఎవరూ రాణించలేదు. 30 బంతులు ఆడిన రోహిత్ 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో అమిత్ మిశ్రా 4 వికెట్లు పడగొట్టాడు. అవేష్ ఖాన్ 2 వికెట్లు తీయగా, మార్కస్ స్టాయినిస్, కగిసో రబాడా, లలిత్ యాదవ్‌లకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్లలో శిఖర్ ధావన్, స్టీవెన్ స్మిత్‌లు రాణించారు. 42 బంతులు ఆడిన ధావన్ 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 45 పరుగులు చేయగా, 29 బంతులు ఆడిన స్మిత్ 4 ఫోర్లతో 33 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో జయంత్ యాదవ్, జస్‌ప్రిత్ బుమ్రా, రాహుల్ చాహర్, కిరన్ పొల్లార్డ్‌లకు తలా 1 వికెట్ దక్కింది.