కొత్త తెలుగు సంవత్సరంలో చైత్ర శుద్ధ నవమి రోజు దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. నవమి రోజు శ్రీరాముని వివాహం జరిగినదని, ప్రతి గ్రామంలో ఉన్న రాములోరి ఆలయాలలో రాముని కళ్యాణం ఎంతో వైభవంగా జరిపించి ఈ పండుగను నిర్వహించుకుంటారు.
శ్రీరామనవమి రోజు కేవలం శ్రీరాముని వివాహం మాత్రమే కాకుండా శ్రీరామచంద్రుడు జన్మించినది కూడా చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం, అభిజిత్ లగ్నం అందు జన్మించాడు. అదేవిధంగా తండ్రి మాట కోసం 14 సంవత్సరాలు వనవాసం చేసిన శ్రీరామచంద్రుడు తిరిగి చైత్ర శుద్ధ పాడ్యమి రోజు అయోధ్యకు పట్టాభిషిక్తుడయ్యాడు. కనుక ఈ రోజును ఎంతో భక్తి శ్రద్ధలతో రాములవారికి ప్రత్యేక పూజలు చేసి ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
శ్రీరామనవమి రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యంగా పానకం, వడపప్పు సమర్పించాలి. అదేవిధంగా “శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే” అనే శ్లోకాన్ని మూడు సార్లు చదవటంవల్ల విష్ణు సహస్ర పారాయణం చేసిన ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.