ముంబైలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 టోర్నీ రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది. చెన్నై ఉంచిన భారీ లక్ష్యాన్ని ఢిల్లీ సునాయాసంగా ఛేదించింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన పంత్ సేన చెన్నైపై విజృంభించింది. దీంతో చెన్నైపై ఢిల్లీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా చెన్నై బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో సురేష్ రైనా, మొయిన్ అలీలు రాణించారు. 36 బంతులు ఆడిన రైనా 3 ఫోర్లు, 4 సిక్సర్లలో 54 పరుగులు చేయగా, 24 బంతుల్లో మొయిన్ అలీ 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ వోక్స్, అవేష్ ఖాన్‌లు చెరో 2 వికెట్లు తీశారు. రవిచంద్రన్ అశ్విన్, టామ్ కుర్రాన్‌లకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 190 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్లలో శిఖర్ ధావన్, పృథ్వీ షాలు రాణించారు. 54 బంతుల్లో ధవన్ 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 85 పరుగులు చేయగా, 38 బంతుల్లో షా 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 72 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు తీశాడు. బ్రేవోకు 1 వికెట్ దక్కింది.