ఢిల్లీ, చెన్నై జట్ల మధ్య శనివారం ముంబైలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ గెలుపొందిన విషయం విదితమే. ఆ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 188 పరుగులు చేసింది. సురేష్ రైనా గత సీజన్‌లో ఆడకపోయినా ఈ మ్యాచ్‌లో రీ ఎంట్రీతో ఆరంభ మ్యాచ్‌లోనే 56 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే బౌలింగ్‌లో విఫలం కావడంతో చెన్నై ఓటమి పాలైంది.
ఢిల్లీ జట్టు కేవలం 18 ఓవర్లలోనే సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. కాగా ఈ మ్యాచ్‌లో చెన్నై బౌలర్లు చాలా నెమ్మదిగా బౌలింగ్ చేశారు. దీంతో ఐపీఎల్ యాజమాన్యం చెన్నై కెప్టెన్ ధోనీకి రూ.12 లక్షల జరిమానా విధించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించినట్లు తెలిపింది. 3 సార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలిచినా గత సీజన్‌లో చెత్త ప్రదర్శన కారణంగా చెన్నై తన ప్రాభవాన్ని కోల్పోయింది. ఇక ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే ఓడింది. దీంతో చెన్నైకి దురదృష్టం కొనసాగుతుందని విశ్లేషకులు అంటున్నారు.
కాగా మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో ధోనీ మాట్లాడుతూ.. తమ బ్యాట్స్‌మెన్ బాగానే బ్యాటింగ్ చేశారని, డిఫెండ్ చేసే స్కోరును ఉంచారని, అయినప్పటికీ బౌలర్లు విఫలం అయ్యారని, అందువల్లే ఓడామని అన్నాడు. ముందు ముందు మ్యాచ్‌లలో బౌలర్లు మరింత పొదుపుగా బౌలింగ్ చేస్తారని ఆశిస్తున్నానని తెలిపాడు.