మన చుట్టూ ప్రపంచంలో అనేక రకాల మిస్టరీలు కలిగిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వాటి గురించి వివరాలు చదువుతుంటేనే భయం కలుగుతుంది. ఇక అలాంటి ప్రదేశాలకు వెళ్లే సాహసం ఎవరూ చేయరు. ఒక వేళ ఎవరైనా వెళ్లినా వెనక్కి తిరిగి రారు అని స్థానికులు చెబుతుంటారు. అలాంటి ఒక ప్రదేశం గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో పంగ్‌సౌ అనే గ్రామానికి దక్షిణం వైపున ఉన్న ప్రాంతంలో ఒక సరస్సు ఉంది. దాన్ని లేక్ ఆఫ్ నో రిటర్న్ లేదా స్థానిక భాషలో నువాంగ్ యాంగ్ అని పిలుస్తారు. ఆ సరస్సులోకి వెళ్లిన ఎవరూ వెనక్కి తిరిగి రాలేదని స్థానికులు చెబుతారు. ఇలా ఎంతో కాలం నుంచి జరుగుతుందని వారంటున్నారు. అయితే దీని వెనుక 3 కథలు ప్రచారంలో ఉన్నాయి. అవేమిటంటే..
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో విమానాలను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు ఈ సరస్సు మీదుగా వచ్చి ఇందులో పడిపోయారట. అలాగే అప్పట్లో కొందరు జపాన్ సైనికులు ఈ సరస్సు వద్దకు వచ్చి మలేరియా వ్యాప్తి చెంది చనిపోయారట. ఇక ఇంకో కథ ప్రకారం..
ఒకప్పుడు ఈ సరస్సుకు సమీపంలో ఉన్న గ్రామంలోని ఓ వ్యక్తి అందులో ఓ పెద్ద చేపను పట్టాడట. దాన్ని ఇంటికి తెచ్చి వండి గ్రామంలోని అందరినీ విందుకు పిలిచాడట. కానీ ఒక వృద్ధురాలిని, ఆమె మనవరాలిని పిలవలేదట. దీంతో ఆగ్రహించిన గ్రామ పెద్ద గ్రామం నుంచి అందరినీ పారిపోమని చెప్పాడట. కానీ వారు అలా చేయకపోవడంతో మరుసటి రోజు ఆ గ్రామానికి వరద వచ్చి ఆ సరస్సులో ఆ గ్రామం మునిగిపోయిందట.
ఇలా స్థానికులు ఆ సరస్సుకు చెందిన 3 రకాల కథలను చెబుతారు. కానీ ఎవరూ అందులోకి వెళ్లేందుకు ధైర్యం చేయరు. అయితే అక్కడికి వచ్చే టూరిస్టులకు మాత్రం ఈ సరస్సును దూరం నుంచి చూపిస్తూ స్థానికులు పర్యాటకం ద్వారా ఆదాయం పొందుతున్నారు. ఇక ఈ సరస్సు నిజానికి మయన్మార్ దేశం కిందకు వస్తుంది. కానీ అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో ఉంటుంది.