అద్భుతాలు అనేవి ఎక్కడో అరుదుగా జరుగుతుంటాయి. అలా జరిగినప్పుడు వాటిని చూసేందుకు జనాలు తండోప తండాలుగా వస్తుంటారు. గుజరాత్‌లోని భుజ్‌లోనూ సరిగ్గా ఇలాగే ఓ అద్భుతం చోటు చేసుకుంది. 9 నెలల వయస్సు ఉన్న ఓ ఆవు దూడ పాలిస్తోంది. దీంతో దాన్ని చూసేందుకు జనాలు పోటీ పడుతున్నారు.
గుజరాత్‌లో ఉన్న భుజ్ ప్రాంతంలో రషీద్ సామా అనే వ్యక్తి 25 ఆవులను పెంచుతున్నాడు. ఆవు పాలను విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్నాడు. అయితే అతని వద్ద ఉన్న ఓ ఆవు దూడ పాలిస్తోంది. దాని వయస్సు 9 నెలలు.
సాధారణంగా ఆవు దూడ పుట్టాక 4 ఏళ్లకు పెద్దదై దూడలకు జన్మనిస్తుంది. దూడ పుట్టాక ఆవు ఏడాది వరకు పాలిస్తుంది. అయితే ఆ ఆవు దూడ వయస్సు 9 నెలలే అయినప్పటికీ పాలిస్తుండడం విశేషం. ఆ దూడ రోజుకు 1-2 గిన్నెల నిండా పాలిస్తుందని రషీద్ చెబుతున్నాడు. దీంతో ఆ దూడను చూసేందుకు చుట్టు పక్కల వారు పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నారు.
అయితే ఆ దూడను కొంటామని, దానికి రూ.55వేల నుంచి రూ.70వేల వరకు ఇస్తామని కొందరు ముందుకు వస్తున్నారు. అయితే దాన్ని అమ్మబోనని రషీద్ తెలిపాడు. ఏది ఏమైనా ఈ విషయం వెటర్నరీ వైద్య నిపుణులకు కూడా అంతుబట్టటం లేదు. దూడ ఎందుకు పాలు ఇస్తుందో వారు కూడా చెప్పలేకపోతున్నారు.