Chair : మన ఇళ్లలో ఉండే పురాతన వస్తువులను ఎందుకూ పనికి రావని పడేస్తుంటాం. లేదా వీలుంటే పాత ఇనుప సామాను వాళ్లకు అమ్మేస్తుంటాం. అయితే అలాంటి వస్తువులే కొన్ని సార్లు అత్యంత విలువైన వస్తువులుగా మారుతుంటాయి. కొన్ని లక్షల రూపాయల ఆదాయాన్ని తెచ్చి పెడుతుంటాయి. సరిగ్గా ఆ మహిళకు కూడా ఇలాగే జరిగింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
యూకేలోని ఈస్ట్ సస్సెక్స్ ప్రాంతం బ్రైటాన్‌కు చెందిన ఓ మహిళ ఓ పాత కుర్చీని 5 పౌండ్లకు (సుమారుగా రూ.500)కు కొనుగోలు చేసింది. స్క్రాప్ దుకాణంలో ఆమె ఆ కుర్చీని కొన్నది. తరువాత దాన్ని ఇంటికి తెచ్చుకుంది. అయితే ఆ కుర్చీ గురించి అసలు విషయం తెలుసుకున్న ఆమె దాన్ని వేలంలో పెట్టగా.. దానికి ఏకంగా 16,250 పౌండ్లు (దాదాపుగా రూ.16.4 లక్షలు) వచ్చాయి. దీంతో ఆమె ఆనందానికి గురైంది.
వాస్తవానికి ఆ కుర్చీ ఇప్పటిది కాదు. 1902 కాలం నాటిది. దాన్ని అప్పట్లో ఆస్ట్రియన్ పెయింటర్ కొలొమన్ మోజర్ డిజైన్ చేశాడు. తరువాత ఆ కుర్చీ చేతులు మారుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు తిరిగి ఆస్ట్రియాకు చెందిన ఓ వ్యక్తే దాన్ని వేలంలో కొనుగోలు చేశాడు. అంతటి పురాతనమైన కుర్చీ మళ్లీ తమ దేశానికే తిరిగి రావడం ఆనందంగా ఉందని దాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి తెలిపాడు. ఏది ఏమైనా ఆ కుర్చీ వల్ల ఇరు వర్గాల వారికి ఎంతో లాభం జరిగిందని చెప్పవచ్చు.