Vikram Movie Tina : లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమలహాసన్ ప్రధాన పాత్రలో వచ్చిన విక్రమ్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీ ఇప్పటికీ థియేటర్లలో ఇంకా ప్రదర్శితం అవుతూనే ఉంది. కలెక్షన్ల పరంగా రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తోంది. కమలహాసన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా విక్రమ్ నిలిచింది. ఈ క్రమంలోనే అనేక మంది ఈ మూవీని ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ను ప్రతి ఒక్కరూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. చాలా రోజుల తరువాత కమలహాసన్ కూడా ఈ చిత్రంతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు.
ఇక ఇందులో కమలహాసన్ మాజీ గూఢచారి ఆఫీసర్‌గా నటించారు. 1986లో వచ్చిన విక్రమ్ మూవీకి కొనసాగింపుగా ఈ మూవీని తీశారు. అందుకని ఆ మూవీలోని కమలహాసన్ పాత్రనే ఇందులోనూ తీసుకున్నారు. ఇక కొత్త విక్రమ్ మూవీలో కథ మొత్తం డ్రగ్స్ చుట్టూనే తిరుగుతుంది. ఈ క్రమంలోనే చిత్రంలో కమల్‌తోపాటు మళయాళ నటుడు ఫహాద్ ఫాసిల్, తమిళ నటులు విజయ్ సేతుపతి, సూర్యలు నటించి అలరించారు. ఇక త్వరలోనే విక్రమ్ 2 కూడా వస్తుందని అంటున్నారు. అయితే ఈ మూవీలో చాలా మందిని ఆకట్టుకున్న పాత్రల్లో ఏజెంట్ టీనా పాత్ర ఒకటి.

ఏజెంట్ టీనా పాత్ర మనకు చివరి వరకు తెలియదు. ఆమె ఇంట్లో సాధారణ పనిమనిషిగా ఉంటుంది. కానీ చివరకు ఏజెంట్ అని తెలుస్తుంది. అలాగే 20 మంది గూండాలపై ఒంటి చేత్తో పోరాడుతుంది. దీంతో ఆ ఫైట్ సీన్‌ను చూసి ప్రేక్షకులు ఎంతో థ్రిల్ అయ్యారని చెప్పవచ్చు. ఇక టీనా పాత్రలో నటించింది ఉత్తరాది నటి అని అందరూ అనుకున్నారు. కానీ ఆమె దక్షిణాదికి చెందినవారే. ఆమె ఒక డ్యాన్స్ అసిస్టెంట్. సినిమా ఇండస్ట్రీలో 30 ఏళ్లు నుంచి డ్యాన్స్ అసిస్టెంట్‌గానే కొనసాగుతోంది.
ఇక టీనా పాత్రలో నటించిన డ్యాన్స్ అసిస్టెంట్ పేరు వాసంతి. ఈమెది చెన్నై. 1992 నుంచి ఈమె సినిమా ఇండస్ట్రీలో డ్యాన్స్ అసిస్టెంట్‌గా కొనసాగుతూ వస్తోంది. ఇప్పటి వరకు అనేక మంది మాస్టర్స్ వద్ద పనిచేసింది. ప్రస్తుతం ఈమె దినేష్ అనే డ్యాన్స్ మాస్టర్ టీమ్‌లో మెంబర్‌గా ఉంది. ఈమె నయనతార, త్రిష, అనుష్క, అమీ జాక్సన్, సమంత, కత్రినా కైఫ్ తదితర హీరోయిన్లకు డ్యాన్స్ స్టెప్స్ నేర్పించింది. అయితే తమిళ నటుడు విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో విజయ్ కాలేజ్ లో అందరి ఎదుట డ్యాన్స్ చేసే పాట ఉంటుంది. వాతి కమింగ్ అనే ఈ పాటలో నటీనటులకు వాసంతి డ్యాన్స్ స్టెప్స్ నేర్పించింది. ఈ క్రమంలోనే ఆమె దర్శకుడు లోకేష్ కనగరాజ్ కంట పడింది.
విక్రమ్ సినిమాలో టీనా అనే పాత్రకు వాసంతి సరిగ్గా సరిపోతుందని లోకేష్ భావించారు. దీంతో ఆమెను వెంటనే కాంటాక్ట్ అయ్యారు. ఆమెకు ఆడిషన్ చేసి ఓకే చేశారు. దీంతో ఆమెకు విక్రమ్ మూవీలో నటించే చాన్స్ లభించింది. అయితే మూవీ రిలీజ్ అయ్యాక ఆమె కూడా ఎంతో పాపులర్ అయింది. తనకు అనేక మంది ఫోన్ కాల్స్ చేశారని.. ప్రతి ఒక్కరూ తన నటనకు తనను అభినందించారని చెప్పింది. ఇక విక్రమ్ మూవీ ప్రస్తుతం ఓటీటీలోనూ అందుబాటులో ఉంది. దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్‌లో చూడవచ్చు.