Venu Swamy : గత కొద్ది రోజులుగా నటుడు నరేష్, పవిత్ర లోకేష్‌ల వ్యవహారం సంచలనంగా మారిన విషయం విదితమే. అయితే ఈ మధ్యకాలంలో వీరి నుంచి ఎలాంటి అప్‌డేట్స్ లేవు. అయినప్పటికీ వీరిపై వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి. ఇక నరేష్ పెళ్లి, విడాకులతోపాటు విజయ నిర్మల మరణంపై కూడా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అప్పట్లో చెప్పినట్లే వారి జీవితాల్లో జరిగిందని తెలిపారు.
నరేష్ కుటుంబంలో తాను మొదటి నుంచి పూజలు చేసే వాడినని వేణు స్వామి తెలిపారు. తాను కృష్ణ ఇంట్లో కూడా పూజలు చేశానన్నారు. తనకు కృష్ట అంటే ఇష్టమన్నారు. అయితే నరేష్, రమ్యల జాతకాలను తనకు చూపించారని.. కానీ వారి జాతకాలు కలవలేదని అన్నారు. అయినప్పటికీ పేర్లు మార్చి వివాహం చేసుకున్నారని.. కానీ వారు ఏదో ఒక రోజుకు విడిపోక తప్పదని తాను అప్పట్లోనే చెప్పానని.. అందుకనే తాను వారి వివాహాన్ని జరిపించలేదని అన్నారు. అయితే తాను చెప్పినట్లుగానే నరేష్, రమ్యలు విడాకులు తీసుకోబోతున్నారు.. అని వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశారు.

ఇక అప్పట్లో కృష్ణ, విజయనిర్మల జాతకాలు చూసి వారిద్దరిలో ఎవరైనా ఒకరు 2020లో చనిపోతారని చెప్పానని.. అయితే అలా జాతకాలు చెప్పినందుకు నరేష్ తనను కోప్పడ్డారని వేణు స్వామి అన్నారు. కృష్ణ అంటే తనకు ఇష్టం కనుక ఆయనకు ఏమీ జరగొద్దనే ఉన్న విషయం చెప్పేశానని తెలిపారు. అప్పటి నుంచి నరేష్ తనను దూరం పెట్టారని.. ఆ తరువాత నుంచి తాను కూడా వారికి దూరంగానే ఉన్నానని.. వేణు స్వామి తెలియజేశారు. అయితే నరేష్ విడాకుల నేపథ్యంలో వేణు స్వామి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
గతంలోనూ వేణు స్వామి చెప్పిన జోస్యాలు నిజం అయ్యాయి. జగన్ సీఎం అవుతారని చెప్పగా అలాగే జరిగింది. దీంతోపాటు సమంత, నాగచైతన్య విడిపోతారని చెప్పారు. అది కూడా అలాగే జరిగింది. అయితే సమంత జాతకంలో దోషం ఉందని, ఇంకా పోలేదని అందువల్లే ఆమె త్వరలో ఇంకా కష్టాలు పడుతుందని కూడా ఆయన అప్పట్లో తెలిపారు. అయితే వేణు స్వామి తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం చర్చనీయాంశంగా మారాయి.