Unstoppable Show : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ దశాబ్దాలుగా క్రేజ్ కొనసాగిస్తున్నాడు. వెండితెర సంగతి పక్కనపెడితే బాలయ్య మొదటిసారి బిగ్ స్క్రీన్ నుంచి డిజిటల్ ఫ్లాట్ ఫాంపై తొలి అడుగు వేశారు. ఆహాలో అన్ స్టాబబుల్ అంటూ ఓ టాక్ షో లో హోస్ట్ గా చేశారు. అగ్ర హీరోలందరూ ఈ షోలో పాల్గొన్నారు. ఈ సీజన్ 1 షో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో సీజన్ 2 ఎప్పుడా అని అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులకు తగినట్లే త్వరలోనే అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 2ను నిర్వాహకులు ప్రారంభించబోతున్నారట.
ఇప్పటికే నందమూరి ఫ్యాన్స్.. అటు మెగా ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ సినిమా సమయంలో బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మరోసారి అంతకు మించిన కిక్‌ను ఎంజాయ్ చేయబోతున్నారట. ఇంతకీ విషయం ఏంటంటే.. నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి ఒకే వేదికపై కనిపించబోతున్నారు. ఇద్దరికీ సినీ నేపథ్యం, రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ ఒకే వేదికపై ఎప్పుడూ కనిపించలేదు. అలాంటిది ఇద్దరూ కనిపించి, ఒకరు ప్రశ్నలు వేయటం, మరొకరు సమాధానాలు చెప్పటం చేస్తే ఇంకెలా ఉంటుంది అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. త్వరలోనే అభిమానుల కోరిక తీరుతుందని ఫిల్మ్ సర్కిల్ లో టాక్ నడుస్తుంది.

సీజన్ 1 కంటే సీజన్ 2ను ఇంకా గొప్పగా ఉండేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. అందులో భాగంగా ఈసారి పవన్ కళ్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్.. అతిథులుగా రాబోతున్నారని సమాచారం. వారిని నందమూరి స్టార్ హీరో ప్రశ్నించనున్నాడని సమాచారం. అసలే త్రివిక్రమ్, పవన్ ఎంత సన్నిహితులో తెలుసు. వీరికి తోడు బాలకృష్ణ కూడా ఉండడంతో కొత్త సీజన్ పై అందరికీ ఆసక్తి నెలకొంది. ఇదే జరిగితే.. సినిమా ముచ్చట్లతోపాటు రాజకీయ అంశాలు కూడా చర్చకు వస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రాబోయే ఈ షో మాత్రం మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్‌కు కన్నుల పండుగగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.