TSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్‌టీసీ) బస్సు చార్జిలను పెంచింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చార్జిలను పెంచుతున్నట్లు తెలిపారు. పల్లె వెలుగు బస్సుల్లో కిలోమీటర్‌కు 25 పైసలు, మిగిలిన బస్సు సర్వీసుల్లో కిలోమీటర్‌కు 30 పైసల చొప్పున చార్జిలను పెంచుతున్నట్లు తెలిపారు.
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉన్న రవాణా శాఖ కార్యాలయంలో ఈ మేరకు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, ఎండీ సజ్జనార్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఆర్‌టీసీ ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉందని తెలిపారు. నష్టాల నుంచి సంస్థను గట్టెక్కించేందుకే చార్జిలను పెంచుతున్నామని తెలిపారు.
బస్సు చార్జిలను పెంచితే ప్రస్తుతం ఉన్న నష్టాల్లో కొంత మేర తగ్గే అవకాశం ఉందని మంత్రి అన్నారు. గత 3 ఏళ్ల కాలంలో ఆర్‌టీసీకి ఆదాయం భారీగా తగ్గిందని, ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. గడిచిన 3 ఏళ్లలో ఆర్‌టీసీకి ఏకంగా రూ.4,260 కోట్ల మేర నష్టాలు వచ్చాయని తెలిపారు. పెరుగుతున్న నష్టాలను తగ్గించుకోవాలంటే ఆర్టీసీ చార్జిలను పెంచక తప్పడం లేదని స్పష్టం చేశారు.
2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌టీసీకి రూ.4,882 కోట్ల ఆదాయం రాగా ఖర్చు మాత్రం రూ.5,811 కోట్లు అయింది. అలాగే 2019-20 సంవత్సరంలో రూ.4,592 కోట్ల ఆదాయం రాగా, ఖర్చు రూ.5,594 కోట్లు అయింది. ఇక 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌టీసీ ఆదాయం రూ.2,455 కోట్లు ఉండగా, ఖర్చు రూ.4,784 కోట్లకు చేరుకుంది. ఈ క్రమంలో చార్జిలను పెంచితే ఆర్‌టీసీకి ఏడాదికి రూ.850 కోట్ల మేర ఆదాయం వస్తుందని మంత్రి తెలిపారు.