తెలంగాణలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతుండడంతో హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఇందులో భాగంగానే కరోనా మార్గదర్శకాల అమలు పై రాష్ట్ర డీజీపీ కోర్టుకు నివేదిక అందించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కరోనా మార్గదర్శకాల ప్రకారం ఆర్టీపీసీఆర్ పరీక్షలను 70 శాతం పెంచాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించే ప్రయాణికులకు తప్పనిసరిగా కరోనా పరీక్షలు నిర్వహించాలని, కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి నిపుణులతో కూడిన కమిటీ వేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో ఈ విధంగా రోజురోజుకు కరోనా కేసులు పెరగటానికి ముఖ్య కారణం మద్యం దుకాణాలని, మద్యం దుకాణాలు కరోనా మహమ్మారికి కేంద్రబిందువుగా మారాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నిబంధనలను ఉల్లంఘించిన ఘటనలలో ఇప్పటివరకు 22 వేల కేసులు నమోదైనట్లు ఈ నివేదికలో డీజీపీ పేర్కొన్నారు. అదేవిధంగా సామాజిక దూరం పాటించని వారిపై కూడా ఇప్పటివరకు 2,416 కేసులను నమోదు చేసినట్లు డీజీపీ పేర్కొన్నారు.