దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తోంది. రోజుకు 90వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ గత వారం రోజులుగా రోజూ నమోదవుతున్న కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇక నిజామాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన పెళ్లి వేడుక కోవిడ్ హాట్ స్పాట్‌గా మారింది.
నిజామాబాద్ జిల్లాలోని హన్‌మాజీపేటలో జరిగిన ఓ వివాహ వేడుకకు సుమారుగా 370 మంది అతిథులు హాజరయ్యారు. అయితే వారిలో కొందరికి కోవిడ్ లక్షణాలు కనిపించాయి. దీంతో అధికారులు వెంటనే అందరికీ పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో వారిలో 87 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో అందరినీ ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అందుకు గాను ఆ గ్రామంలో ప్రత్యేక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు.
కాగా తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం ఒక్క రోజే 1097 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 8,746కు చేరుకోగా మొత్తం కేసుల సంఖ్య 3.13 లక్షలకు చేరుకుంది. 1723 మంది కోవిడ్ వల్ల చనిపోయారు.