సాధారణంగా మన ఇంట్లో ఫ్లోర్ ఒక రోజు శుభ్రం చేసుకుంటే మరుసటి రోజు మరి శుభ్రం చేసుకోవాల్సిందే. ప్రస్తుతం కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందుతుండడంతో ప్రతి ఒక్కరూ ఇంట్లో ప్రతి వస్తువును తరచూ శుభ్రం చేస్తుంటారు. ప్రతిరోజు ఈ విధంగా అన్ని వస్తువులను శుభ్రం చేయాలంటే ఎంతో సమస్యగా మారింది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ ఐఐటీ హైదరాబాద్ ఆధునిక టెక్నాలజీతో కొవిడ్ రక్షణ ఉత్పత్తులను అభివృద్ధి చేసింది. ఒక్కసారి వీటితో ఫ్లోర్, కుర్చీ, సోఫా తదితర వస్తువులన్నింటికీ ఒకరోజు స్ప్రే చేస్తే దాదాపు 35 రోజులపాటు ఎంతో రక్షణగా ఉంటాయి.
ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ స్టార్టప్ కంపెనీ కియా బయోటెక్ ‘డ్యూరోకియా’ పేరుతో వీటిని తయారుచేసింది. సాధారణంగా మార్కెట్లో లభించే శానిటైజర్ లు ఆల్కహాల్ తో తయారవుతాయి. దీనితో తరచూ చేతులు శుభ్రం చేయటం వల్ల చర్మ సమస్యలు ఎదురవుతున్నాయి. కానీ డ్యూరోకియా శానిటైజర్ లతో ఒక్కసారి శానిటైజ్ చేయడం ద్వారా 24 గంటల పాటు సురక్షితంగా ఉంచుతుంది. ప్రొఫెసర్ జ్యోతిష్ నందు గిరి బృందం దీనిని అభివృద్ధి చేసింది.
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంతో పాటు అతి తక్కువ ధరలకే వీటిని మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఈ ‘డ్యూరోకియా’ఉత్పత్తులను శుక్రవారం కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ప్రారంభించనున్నారు. ఈ ఉత్పత్తులను నేటి నుంచి అమెజాన్ లో కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఉత్పత్తులను ఉపయోగించి మాస్కులను కూడా శానిటైజ్ చేసి తిరిగి వాడవచ్చని పరిశోధకులు తెలియజేస్తున్నారు.