దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజూ 2.50 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో పరిస్థితి చేయి దాటిపోతోంది. ఇక తెలంగాణలోనూ రోజువారీగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలోనే హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది.
మంగళవారం (ఏప్రిల్ 20) నుంచి మే 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు తెలంగాణ రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ అమలు కానుంది. రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో రోజూ రాత్రి 9 నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. కర్ఫ్యూ వల్ల రాత్రి 8 గంటలకే వ్యాపార, వాణిజ్య సముదాయాలు, సంస్థలను మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇక ఉద్యోగులు రాత్రి 9 గంటల వరకు ఇళ్లకు చేరుకోవాల్సి ఉంటుంది. అత్యవసర సేవలకు మినహాయింపులు ఇస్తారు. మీడియా, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ సేవలు, కేబుల్ సేవలు, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, ఈ-కామర్స్ సంస్థల సేవలు, పెట్రోల్ పంపులు, విద్యుత్, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, కోల్డ్ స్టోరేజీలు, వేర్ హౌస్‌ల సేవలు, సెక్యూరిటీ సేవలు, పరిశ్రమలు, ఇతర సేవలకు మినహాయింపులు ఇచ్చారు. అందువల్ల ఈ రంగాలకు చెందిన వారు ఎలాంటి ఆటంకం లేకుండా తమ పనులు కొనసాగించవచ్చు. అయితే ఆయా పరిశ్రమలు, సంస్థల్లో పనిచేసేవారు రాత్రి పూట విధులకు హాజరైతే తమ ఐడీ కార్డులను కచ్చితంగా చూపించాల్సి ఉంటుంది.
వైద్య సేవలు, ఎయిర్ పోర్టులు, బస్టాండ్ల నుంచి వచ్చేవారు తగిన ఆధారాలు చూపించి కర్ఫ్యూ నుంచి మినహాయింపు పొందవచ్చు. ఈ నిబంధనలను అతిక్రమించే వారిపై పోలీసులు చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటారు.