Tarakarama Theatre : నందమూరి తారకరామారావు 1949లో మనదేశం సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి.. అతి తక్కువ కాలంలోనే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అనే స్థాయికి ఎదిగారు. తెలుగు వెండి తెర ఆరాధ్య దైవమయ్యారు. పౌరాణిక చిత్రాల్లో తిరుగులేని నటుడుగా ఎదిగారు. ఎన్టీఆర్ సినిమాలతోపాటు రాజకీయాలని కొంతకాలం ఏకచత్రాధిపత్యంగా ఏలారు. ఆయన సినిమాల్లో ఓ వెలుగు వెలుగుతున్న కాలంలోనే హైదరాబాద్ లో విలువైన ఆస్తులు సంపాదించారు. అలా ఆయన సంపాదించిన ఆస్తులలో చెప్పుకోదగ్గ ప్రాపర్టీ కాచిగూడలోని తారకరామ థియేటర్.
ఈ థియేటర్ కట్టకముందు కాచిగూడ చౌరస్తాలోని ఈ ప్లేస్ లో కొంతమంది పక్షులను వేటాడి జీవనం సాగిస్తుండేవారు. వారికి ఎంతోకొంత ముట్టజెప్పి ఆ స్థలాన్ని ఖాళీ చేయించి సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. అనంతరం అక్కడ తారకరామ అనే థియేటర్ ను నిర్మించారు. అక్బర్ సలీం అనార్కలీ సినిమాతో ఆ థియేటర్ ను ప్రారంభించాలని ఎన్టీఆర్ ఆశించారు.

కానీ థియేటర్ కట్టడం ఆలస్యం అవడంతో ఆల్రెడీ ఆంధ్ర, సీడెడ్ లో ఆ చిత్రం విడుదలైంది. అక్కడ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న తర్వాత నైజాంలో విడుదల చేయగా అది కేవలం ఈ థియేటర్లో 22 రోజులు మాత్రమే ఆడి ఫ్లాప్ మూవీగా నిలిచింది. తెలుగు, హిందీ చిత్రాలను ఇక్కడ రిలీజ్ చేసినప్పటికీ అమితాబ్ నటించిన డాన్ చిత్రం ఎక్కువ రోజులు (525) ఆడి రికార్డు సృష్టించింది.
ఆ తర్వాత నాగార్జున గీతాంజలి 225 రోజులు, ఇంకొన్ని సినిమాలు 100 రోజులకు పైగా ఆడాయి. కానీ 1991 లో రాజీవ్ గాంధీ హత్యానంతరం ప్రతిపక్ష నాయకుల ఆస్తులపై జరిగిన దాడులలో ఈ థియేటర్ కొంతవరకు ధ్వంసం అయింది. దీంతో 1995లో మళ్ళీ పునరుద్ధరించారు. కానీ అప్పటికే తారకరామ థియేటర్ వైభవాన్ని కోల్పోయింది. ఆ తర్వాత విడుదలైన ఏ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. క్రమంగా అది బి సెంటర్ థియేటర్ గా మారిపోయింది. చివరకు ఆంగ్ల, మలయాళ బూతు చిత్రాలు ప్రదర్శించేవారు.
ఆ తర్వాత ఏషియన్ వారు ఈ థియేటర్ ను లీజ్ కి తీసుకొని ఏషియన్ తారకరామా అని మల్టీప్లెక్స్ రూపంలో తీసుకొచ్చినప్పటికీ దానికి వచ్చిన ఇబ్బందులు తొలగలేదు. ఎంతో విశాలంగా అభివృద్ధి చేసినా కూడా ఆ థియేటర్లో ఎక్కువ రోజులు ఆడిన (73 రోజులు) మూవీ ఉరి ద సర్జికల్ స్ట్రైక్. మొత్తానికి ఎన్టీఆర్ ఎంతో ఇష్టపడి కట్టుకున్న థియేటర్ చివరకు బి గ్రేడ్ థియేటర్ గా ఆ తర్వాత, అద్దె కూడా వసూలు చేయలేని థియేటర్ గా మిగిలిపోవడం బాధాకరమైన విషయమని చెప్పవచ్చు.