Murali Mohan : సీనియర్ నటుడు మురళీమోహన్ ఒకప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉండే వారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. మన ఊరి పాండవులు మూవీని బాపు దర్శకత్వంలో, ముళ్ళపూడి వెంకట రమణ రచయితగా 1978లో తెరకెక్కించారు. ఇందులో కృష్ణంరాజు, మురళీమోహన్, చిరంజీవి, ప్రసాద్ బాబు, రావుగోపాలరావు ప్రధానపాత్రల్లో నటించారు. నాటి సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కొంత విప్లవాత్మకంగా కథను తీర్చిదిద్దారు ముళ్ళపూడి వెంకట రమణ.
అయితే మన ఊరి పాండవుల సినిమా నిర్మాత జయకృష్ణ ఒకసారి ప్రాణం ఖరీదు మూవీ నిర్మాత గంగాధర్ ఆఫీసుకు వెళ్లారట. అక్కడ నటీనటుల ఆల్బమ్ చూస్తుండగా.. చిరంజీవి ఫోటో చూశారు. ఆయన ముఖంలో తేజస్సు, ఎర్రటి కళ్ళు జయకృష్ణకు బాగా నచ్చాయట. ఆ ఫోటో తీసుకువెళ్లి డైరెక్టర్ బాపుకు చూపించి.. మన చిత్రంలోని అర్జునుడిని పోలిన పాత్రకు బాగా సెట్ అవుతాడని చిరంజీవిని తీసుకుందామనుకున్నారట. అలా మన ఊరి పాండవులు చిత్రంలో హీరో, హీరోయిన్స్ ఉండరని పంచపాండవుల లాంటి ఐదుగురు సినిమా నడిపిస్తారని.. అందులో మీది (చిరంజీవిది) ఒక పాత్ర అని చెప్పడంతో చిరంజీవి వెంటనే ఓకే అన్నారట.

మన ఊరి పాండవులు చిరంజీవికి నటన పరంగా మూడో సినిమా కాగా, విడుదలపరంగా రెండవ సినిమా. ఈ సినిమా షూటింగ్ గోదావరి జిల్లాలో జరుగుతున్నప్పుడు ఒకసారి మురళీమోహన్, కృష్ణంరాజు కబుర్లు చెప్పుకుంటూ.. చిరంజీవి గురించి ప్రస్తావన వచ్చిందని, భవిష్యత్తులో చిరంజీవి విలన్ అవుతాడు అనుకున్నాం.. కానీ చిరంజీవి ఏకంగా సినిమాలకే రంకు మొగుడు అయ్యారంటూ.. మురళీమోహన్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చమత్కరించారు. ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రేక్షకులు కూడా మురళీమోహన్ మాటలు విని ఆశ్చర్యపోయారు.