Tammareddy Bharadwaja : తమ్మారెడ్డి భరద్వాజ ఒకప్పుడు నిర్మాతగా, దర్శకుడిగా ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. ఆయన సినిమాలు ఎంతో వైవిధ్యభరితంగా ఉండేవి. అయితే ఇప్పుడు ఆయన సినిమాలను తీయడం లేదు. కానీ సినిమా రంగానికి చెందిన విషయాలపై స్పందిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి సహా కొందరు హీరోలు, దర్శకులు గతంలో సీఎం జగన్‌ను కలిసి ఏపీలో థియేటర్లలో టిక్కెట్ల ధరలను పెంచాలని.. సినిమా రంగానికి చెందిన సమస్యలను పరిష్కరించాలని కోరారు. అయితే దీనిపైనే తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.
చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి పెద్దరికం తీసుకుని వారి సమస్యలను పరిష్కరించడం కోసం కృషి చేస్తున్నారు. బాగానే ఉంది. కానీ ప్రస్తుతం థియేటర్ల విషయానికి వస్తే టిక్కెట్ల ధరలు తక్కువగా ఉంటేనే మంచిది. కరోనా కారణంగా ఓటీటీలు రావడంతో ప్రేక్షకులు వాటికి అలవాటు పడిపోయారు. అలాంటి స్థితిలో వారిని సామాన్యంగా థియేటర్లకు రప్పించడమే కష్టం. అలాంటిది టిక్కెట్ల ధరలను పెంచితే వారు ఎలా వస్తారు ? ఇది నష్టానికి దారి తీస్తుందని ముందే చెప్పాను. అలాగే జరిగింది.. అంటూ తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు.

సినిమా టిక్కెట్ల ధరలు ఎక్కువగా ఉంటే ప్రేక్షకులు చూడరని.. ఈ విషయంలో చిరంజీవి నిర్ణయం తప్పని అన్నారు. ఆయన అసలు జగన్‌ను కలవకుండా ఉండాల్సిందని అన్నారు. ఈవిధంగా ఇంకోసారి చేసి సినిమా ఇండస్ట్రీ పరువు తీయవద్దని అన్నారు. ఈ క్రమంలోనే తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
అయితే టిక్కెట్ల ధరలు అధికంగా ఉన్నా సరే కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్, విక్రమ్ వంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. అందువల్ల సినిమాలో కథ బలంగా ఉంటే అప్పుడు టిక్కెట్ల ధరలను పెంచినా ప్రేక్షకులు చూస్తారు. కానీ సినిమా బాగా లేకపోతే అది ఎంత పెద్ద సినిమా అయినా సరే ప్రేక్షకులు తిరస్కరిస్తారు. ఈవిషయం ఆచార్య, రాధేశ్యామ్ చిత్రాల విషయాల్లో రుజువు అయింది. అయితే ఉన్నట్లుండి తమ్మారెడ్డి భరద్వాజ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారనే విషయం మాత్రం అంతుబట్టడం లేదు.