T20 World Cup 2022 : క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న టీ20 వరల్డ్ కప్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఈ వరల్డ్ కప్‌లో ఆడేందుకు ఇప్పటికే జట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే భారత్ కూడా ఈసారి ఎలాగైనా సరే కప్ సాధించాలని పట్టుదలగా ఉంది. ఇక వరల్డ్ కప్ అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానుండగా.. అసలు మ్యాచ్‌లు మాత్రం అక్టోబర్ 22 నుంచి ప్రారంభం అవుతాయి. కాగా భారత్ తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది.
ఇటీవలే భారత్ పాకిస్థాన్ చేతిలో ఆసియా కప్‌లో ఘోర పరాభవం పాలైంది. దీంతో ఆ జట్టుపై ప్రతీకారం తీర్చుకోవాలనే కాంక్షతో భారత ఆటగాళ్లు ఉన్నారు. అక్టోబర్ 23న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మెల్‌బోర్న్‌లో మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈసారి వరల్డ్ కప్‌లో గెలిచిన వారికి, ఇతరులకు ఎంత ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ మొత్తం ప్రైజ్ మనీ 56 లక్షల డాలర్లు కాగా.. విజేతలకు 16 లక్షల డాలర్లు లభిస్తాయి. రన్నర్స్ అప్ జట్టుకు 8 లక్షల డాలర్లను అందిస్తారు. అలాగే సెమీ ఫైనల్‌లో ఓటమి పాలైన జట్లకు ఒక్కో దానికి 4 లక్షల డాలర్లను అందిస్తారు. ఇక సూపర్ 12 విజేత జట్లకు ఒక్కో దానికి 40వేల డాలర్లను అందిస్తారు. అలాగే సూపర్ 12లో ఓటమి పాలైన జట్లకు ఒక్కో దానికి 70వేల డాలర్లను అందిస్తారు. ఫస్ట్ రౌండ్ విజేతలకు ఒక్కో జట్టుకు 40వేల డాలర్లను అందిస్తారు. అలాగే మొదటి రౌండ్ లోనే వెను దిరిగి పోయే జట్లకు కూడా ఒక్కోదానికి 40వేల డాలర్లను అందిస్తారు. ఇలా ప్రైజ్ మనీని అందించనున్నారు.