T20 World Cup 2021 : దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 14వ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో వెస్టిండీస్ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. కేవలం 55 పరుగులకే విండీస్ జట్టు కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. విండీస్ పై ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా ఫీల్డింగ్‌ను ఎంచుకోగా.. వెస్టిండీస్ బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో విండీస్ జట్టు 14.2 ఓవర్లు మాత్రమే ఆడి 55 పరుగులకు కుప్పకూలింది. విండీస్ బ్యాట్స్‌మెన్లు పూర్తిగా విఫలం అయ్యారు. ఎవరూ ఆకట్టుకోలేదు. వచ్చిన బ్యాట్స్‌మన్ వచ్చినట్లే చెత్త షాట్‌లు ఆడి పెవిలియన్ బాట పట్టారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 4 వికెట్లు పడగొట్టగా.. మొయిన్ అలీ, టైమల్ మిల్స్ చెరో 2 వికెట్లు తీశారు. క్రిస్ వోక్స్, క్రిస్ జోర్దాన్‌లు చెరొక వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఛేదించాల్సిన లక్ష్యం స్వల్పమే అయినప్పటికీ ఆరంభంలో తడబడింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ 8.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్లను కోల్పోయి 56 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లలో జాస్ బట్లర్ 24 పరుగులు చేశాడు. ఓపికగా ఆడుతూ జట్టుకు విజయం అందించాడు. విండీస్ బౌలర్లలో అకియల్ హోసియన్ 2 వికెట్లు తీయగా, రవి రామ్‌పాల్ 1 వికెట్ తీశాడు.