Shiva Shankar Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ గత కొద్ది రోజులుగా కరోనాతో బాధపడుతూ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విషయం విదితమే. కాగా ఆయన కొంతసేపటి క్రితం కన్నుమూశారు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు.
ఇటీవలే కరోనా బారిన పడిన ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన ఆర్థిక స్థితి బాగాలేకపోవడంతో పలువురు హీరోలు ఆయనకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ క్రమంలో ఆయన ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ 75 శాతం సోకింది. ఈ క్రమంలో హాస్పిటల్‌లో వైద్యులు ఆయనకు ఐసీయూలో చికిత్సను అందించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరకు ఆయన కన్నుమూశారు.
శివశంకర్ మాస్టర్‌కు సోనూసూద్, ధనుష్, చిరంజీవి, మంచు విష్ణు తదితరులు ఆర్థిక సహాయం అందజేశారు. కాగా ఆయన భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 10 భాషలకు చెందిన చిత్రాల్లో పనిచేశారు. డ్యాన్స్ మాస్టర్‌గా ఎంతగానో పేరు తెచ్చుకున్నారు. పలు సినిమాల్లో నటించడంతోపాటు టీవీల్లో పలు డ్యాన్ష్ షోలకు జడ్జిగా హాజరై పేరుగాంచారు. ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ఆయన మరణంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.