Sai Dharam Tej : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గత ఏడాది సెప్టెంబర్ నెలలో మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సమీపంలో బైక్ ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. ఇలా రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సాయిధరమ్ తేజ్ ను వెంటనే ఆసుపత్రికి తరలించి ఆయనకు మెరుగైన వైద్య చికిత్స అందించారు. నెల రోజుల పాటు ఈయన ఆస్పత్రిలో బెడ్ కి పరిమితం కావడంతో మెగా కుటుంబంతోపాటు అభిమానులు అందరూ ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు. నెల రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న సాయిధరమ్ తేజ్ తిరిగి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికే పరిమితమయ్యారు. ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు, కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను వెల్లడిస్తున్నారు.

ప్రమాదం తర్వాత మొదటి సారి మీడియా ముందుకు వచ్చిన సాయి ధరమ్ తేజ్ ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆరు నెలల నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక ప్రమాదం జరిగిన తర్వాత నన్ను కాపాడిన సయ్యద్ అబ్దుల్ ఫహాద్ కు చాలా కృతజ్ఞతలు, నీకున్న మానవత్వంతోననే నేను బతికి ఉన్నాను అంటూ అతని గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. అదే విధంగా నేను ప్రస్తుతం ఇక్కడ ఉన్నాను అంటే ఆ మూడు కుటుంబాలే కారణమని, జీవితాంతం ఆ మూడు కుటుంబాలకి రుణపడి ఉంటాను.. అంటూ సాయి తేజ్ వెల్లడించారు.
ఆ మూడు కుటుంబాలలో మొదటి కుటుంబం మెగా ఫ్యామిలీ, అల్లు కుటుంబానికి ఎంతో రుణపడి ఉన్నానని తెలిపారు. ఇక రెండో కుటుంబంగా భావించే చిత్రపరిశ్రమకు తాను రుణపడి ఉన్నాను, ఈ విషయం తెలియగానే ఎంతోమంది నా గురించి ఆరా తీస్తూ నేను క్షేమంగా రావాలని కోరుకున్నారు. ఇక అభిమానులను మూడవ కుటుంబంగా భావిస్తూ.. నా క్షేమం కోరిన అభిమానులందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని.. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ వెల్లడించారు. ఇక తన తరువాతి సినిమా షూటింగ్ ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని కూడా తేజ్ వెల్లడించారు. ఎట్టకేలకు తేజ్ ఆరోగ్యంగా కనిపిస్తుండడం.. మళ్లీ సినిమాలు చేయనుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.