Rajasekhar : సీనియర్ నటుడు రాజశేఖర్ ఈమధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన, ఆయన భార్యపై గరుడవేగ నిర్మాతలు కేసు పెట్టగా.. వీరిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. తరువాత కోర్టులో వీరు సర్దిచెప్పుకున్నారు. అలాగే ఇటీవల ఇంకో నిర్మాత తనకు డబ్బులు ఇవ్వాలని చెప్పి జీవితా రాజశేఖర్‌పై కేసు పెట్టారు. దీంతో రెండు రోజుల పాటు శేఖర్ మూవీ ప్రదర్శన నిలిచిపోయింది. ఇలా ఈ మధ్య జీవిత రాజశేఖర్ దంపతులు తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఈ విషయాలపై రాజశేఖర్ ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. తనను ఇండస్ట్రీలు కొందరు తొక్కేసేందుకు చూస్తున్నారని అన్నారు. అంతేకాదు.. కొందరు హీరోయిన్లను తన పక్కన నటించకుండా బెదిరించారని కూడా అన్నారు.
కాగా గబ్బర్‌సింగ్ సినిమా సమయంలో పవన్ తనను టార్గెట్ చేశారని చెప్పారు. అందులో ఒక కామెడీ సీన్‌లో తనను పవన్ అనుకరించారని.. అలాగే ఏంట్రా చూసుకో అంటూ తనకు వార్నింగ్ ఇచ్చినట్లుగా చేశారని రాజశేఖర్ అన్నారు. ఇది తనకు ఎంతో బాధ కలిగించిందని అన్నారు. ఇక అప్పట్లో పవన్ తనను టార్గెట్ చేయడం వెనుక ఓ కారణం ఉందన్నారు. ప్రజారాజ్యం పార్టీ సమయంలో తాను ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొన్ని విషయాలు చెప్పానని.. దీంతో పవన్ గురించి మాట్లాడాల్సి వచ్చిందని.. కనుకనే ఆ విషయం మనస్సులో పెట్టుకున్న పవన్ గబ్బర్‌సింగ్ సమయంలో తనను అనుకరించారని అన్నారు.

ఇక సినిమా ఇండస్ట్రీలో తనను ఇబ్బందులకు గురి చేసేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారని రాజశేఖర్ ఆరోపించారు. కొందరు దర్శకులను తనతో సినిమాలు చేయకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. అయితే తనను తొక్కేయాలనుకుంటే అది అంత సులభం కాదని అన్నారు. కాగా రాజశేఖర్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.