Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం.. ఆర్ఆర్ఆర్. ఇందులో తారక్ భీమ్‌గా, చరణ్ అల్లూరిగా నటించి అలరించారు. బాహుబలి రెండు మూవీల్లాగే ఈ మూవీ కూడా తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని నలుదిశలా మళ్లీ వ్యాపింపజేసింది. దీంతో మరోమారు దేశవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని చర్చించుకుంటున్నారు. ఇది ఖండాంతరాలకు కూడా పాకింది. అమెరికా సహా పలు దేశాల్లో ఆర్ఆర్ఆర్‌ను మెచ్చుకుంటూ రాజమౌళిని ప్రశంసిస్తున్నారు. ఇంతటి అద్భుతమైన సినిమాలను తీసే సత్తా తెలుగు వాళ్లకు ఉందని అందరూ అభినందిస్తున్నారు.
అయితే సాధారణంగా హాలీవుడ్‌కు చెందిన వారు ఏదైనా భారీ బడ్జెట్ ఇండియన్ సినిమా వస్తే దాన్ని బాలీవుడ్ వారే తీశారని అనుకుంటుంటారు. ఆర్ఆర్ఆర్ విషయంలోనూ ఇదే జరిగింది. ఓ అమెరికన్ సెలబ్రిటీ ఆర్ఆర్ఆర్ మూవీని బాలీవుడ్ మూవీ అనుకుని బాలీవుడ్‌ను ఆకాశానికెత్తేశారు. దీంతో టాలీవుడ్‌కు దక్కాల్సిన క్రెడిట్ కాస్తా బాలీవుడ్ తన బుట్టలో వేసుకుంది. అయితే దీనిపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సెలబ్రిటీకి అసలు విషయం తెలిసేలా చేశారు. దీంతో ఆయన స్పందించారు.

తాను ఆర్ఆర్ఆర్ మూవీని బాలీవుడ్ మూవీ అనుకున్నానని.. అయితే ఇందులో పొరపాటు జరిగిందని.. తనను క్షమించాలని కోరాడు. జరిగిన తప్పుకు చింతిస్తున్నానని అంటూ.. టాలీవుడ్‌ను మెచ్చుకున్నాడు. దీంతో ఫ్యాన్స్ సంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే టాలీవుడ్‌కు దక్కాల్సిన క్రెడిట్‌ను బాలీవుడ్‌కు ఇవ్వడంతో రాజమౌళి కష్టం అంతా వృథా అయిందని.. ఆయన కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయిందని కొందరు కామెంట్లు చేశారు. కానీ ఆ సెలబ్రిటీ తప్పు తెలుసుకుని సారీ చెప్పడంతో అంతా సద్దుమణిగింది.