Anchor Devi : యంగ్ హీరో విశ్వక్ సేన్ వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సినిమా ప్రమోషన్ కోసం ఆయన ప్లే చేసే గేమే ఇప్పుడు ఆయన్ని వివాదంలో ఇరుక్కునేలా చేసింది. ఓ వైపు కేసులు, మరోవైపు టీవీ9 యాంకర్‌తో వివాదం ఆయనని ఇరుకున పెట్టింది. అయితే ఎన్ని సమస్యలు ఉన్నా కూడా విశ్వక్ సేన్ తన మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంటున్నాడు. విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణం చిత్రంలో నటించారు. రుక్సార్ థిల్లాన్ కథానాయికగా నటించిన ఈ చిత్రం మే 6న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్ కోసం ఓ ప్రాంక్ వీడియో చేశాడు విశ్వక్ సేన్. ఇది వివాదంగా మారి హెచ్ఆర్సీ వరకు వెళ్లింది.

తన ప్రాంక్ వీడియోని చిన్నగా ఫన్ కోసం చేశామని, దీంతోపాటు ముందుగానే ఇంకా చాలా ప్రిపేర్ అయ్యామని, మైండ్‌లో చాలా ప్లాన్స్ ఉండేవని తెలిపారు. కానీ ఈ ఒక్క ప్రాంక్ వీడియో మొత్తం తలకిందులు చేసిందని, అనుకున్నది ఒక్కటి, అయ్యిందొక్కటి అని వాపోయారు. నా సినిమా గురించి జనం మాట్లాడుకుంటే బాగుండేదని, కానీ ఇప్పుడు అసలు విషయం పక్కకెళ్లి, వివాదం చర్చనీయాంశంగా మారిందన్నారు. ఇలాంటివి మళ్లీ చేయనని తెలిపారు. ఏదైనా కొత్తగా చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. తన సినిమాని ప్రమోట్ చేసుకోవడంలో తప్పేముందని ఆయన అన్నారు.
అయితే గతంలో కూడా దేవి నాగవల్లి కొందరు హీరోలతో చేసిన ఇంటర్వ్యూలు వైరల్ అయ్యాయి. అర్జున్ రెడ్డిలో స్త్రీలను కించపరిచారంటూ విజయ్ దేవరకొండకు పలు ప్రశ్నలు వేసి ఇరకాటంలో పెట్టాలని అనుకుంది దేవి. అయితే రౌడీ హీరో తన దైన స్టైల్ లో సమాధానం ఇచ్చారు. ఆ తరువాత విజయ్ దేవరకొండ గీతగోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. రీసెంట్ సిద్దు హీరోగా వచ్చిన డీజే టిల్లు సినిమా ప్రమోషన్స్ లో సిద్దూను మీరు ఉమెనైజరా అంటూ ప్రశ్నించింది. దాంతో సీరియస్ అయిన సిద్ధు.. అసలు ఉమెనైజర్ అంటే అర్థం ఏంటని ప్రశ్నించాడు. దీనిపై పెద్ద చర్చే నడిచింది. ఇక ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా విశ్వక్ సేన్ కు దేవి నాగవల్లితో గొడవ జరిగింది. దీంతో ఈసారి విశ్వక్ సేన్ సినిమా అశోకవనంలో అర్జున కల్యాణం హిట్ అవుతుందని అంటున్నారు. గతంలో విజయ్ దేవరకొండ, సిద్ధుల సినిమాలు దేవితో గొడవ పడడం వల్లే హిట్ అయ్యాయని.. కనుక విశ్వక్ విషయంలోనూ అదే జరుగుతుందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఎవరైనా నటుడు సినిమా తీస్తే దేవితో గొడవ పెట్టుకోవాలని.. అప్పుడు లక్ కలసి వచ్చి సినిమా హిట్ అవుతుందని.. ఈ విషయంపై జోకులు పేలుస్తున్నారు. మరి విశ్వక్‌కు ఇప్పుడు అదే అంశం కలసి వస్తుందా.. లేదా.. అనేది చూడాలి.