5G Services : కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ కాసేపటి క్రితమే 5జి సేవలను ప్రారంభించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 6వ ఎడిషన్‌ను ప్రారంభించిన మోదీ.. అందులో భాగంగానే 5జి సేవలను కూడా ప్రారంభించారు. ఈ క్రమంలోనే దేశంలో త్వరలోనే అన్ని ప్రాంతాల్లోనూ 5జి సేవలు లభ్యం కానున్నాయి. కాగా మార్కెట్‌లో ఇప్పటికే అనేక కంపెనీలు 5జి స్మార్ట్ ఫోన్లను విక్రయిస్తుండడం విశేషం.
ఇక 5జి వల్ల ప్రస్తుతం లభిస్తున్న 4జి సేవలకు 10 రెట్ల స్పీడ్ అయిన సేవలను పొందవచ్చు. ఇంటర్నెట్ స్పీడ్ గరిష్టంగా సెకనుకు 20 గిగాబైట్స్‌గా వస్తుంది. దీని వల్ల కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఒక సినిమాను డౌన్‌లోడ్ చేయవచ్చు. ఇక దేశంలో ముందుగా పలు ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే 5జి సేవలు లభ్యం కానున్నాయి. ఇందుకు గాను టెలికాం ఆపరేటర్లు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

దేశంలో ముందుగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 5జి సేవలను అందిస్తామని జియో తెలియజేసింది. అయితే ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు కూడా 5జి సేవలను అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక 5జి సేవల ప్రారంభంతో అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని నిపుణులు అంటున్నారు. దీని వల్ల అన్ని రంగాల్లోనూ వేగం పుంజుకుంటుందని చెబుతున్నారు.