Pawan Kalyan : రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుక అనంతరం పవన్ కల్యాణ్ రాజకీయాల పరంగా స్పీడు పెంచారు. ఏపీలో వరుస పర్యటనలు చేస్తూ బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే ఆయన శనివారం అనంతపురం జిల్లాలోని నాగులకనుమలో పర్యటించారు. ఈ సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రమదానంలో ఆయన పాల్గొన్నారు.
రాయలసీమ పర్యటన సందర్భంగా పవన్ సంచలన ప్రకటన చేశారు. 2024లో ఏపీలో జనసేన అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు రాయలసీమలోనే సీఎం క్యాంప్ ఆఫీస్‌ను ఏర్పాటు చేస్తామని సంచలన ప్రకటన చేశారు. రాయలసీమ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు.
రాయలసీమలో ఉపాధి అవకాశాలు లేవని, దీంతో యువత వలస వెళ్లిపోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. రాయలసీమ నుంచి ఎంతో మంది సీఎంలు వచ్చారని, కానీ పరిశ్రమలను తేలేదని విమర్శించారు. తాను సీఎంను అయితే రాయలసీమకు పరిశ్రమలను రప్పిస్తానని స్పష్టం చేశారు.
తాను నెల్లూరు జిల్లాలో చదువుకున్నానని, రెడ్డి సామాజికవర్గంతో కలిసి పెరిగానని, రాయలసీమ కరువు సీమగా మారిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనదే అధికారమని అన్నారు. వైసీపీ పాలన బాగుంటే తాము రోడ్ల మీదకు వచ్చే అవసరం ఉండేది కాదన్నారు. రాయలసీమ పోరాటాల, పౌరుషాల గడ్డ అని, ప్రజా స్వామ్యం అనే ఆయుధాన్ని ప్రజలు వాడుకోవాలని పిలుపునిచ్చారు.