Parasuram : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ధ ఘన విజయం సాధించి రికార్డుల వేట దిశగా కొనసాగుతోంది. ఆరంభంలో ఈ మూవీకి కాస్త నెగెటివ్ టాక్ వచ్చినా.. కావాలని కొందరు పనిగట్టుకుని నెగెటివ్ టాక్‌ను ప్రచారం చేశారని తెలిసింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రోల్ చేశారు. ఈ క్రమంలోనే నెగెటివ్ టాక్ తగ్గింది. దీంతో సినిమా కలెక్షన్ల వేట దిశగా కొనసాగుతోంది. ఇక వరుసగా మూడో సినిమా కూడా హిట్ కావడంతో మహేష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే సర్కారు వారి పాట దర్శకుడు పరశురామ్ ఓ విషయంలో క్షమాపణలు చెప్పారు. అందుకు కారణం ఏమిటంటే..
సర్కారు వారి పాట మూవీలో సముద్రఖని విలన్‌గా చేసిన విషయం విదితమే. ఆయన ఓ సీన్‌లో మహేష్‌తో మాట్లాడుతూ తనను తాను నరసింహ స్వామితో పోల్చుకుంటాడు. ఏడాదంతా సింహాచలం నరసింహ స్వామిని చందనంతో కప్పి ఉంచుతారు. ఆయన నిజ స్వరూపాన్ని చూస్తే తట్టుకోలేరు.. అని అంటాడు. అయితే ఇలా ఒక విలన్‌ని స్వామి వారితో పోల్చడం ఏమిటని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి పరశురామ్ స్పందించారు. ఆయన వారికి క్షమాపణలు చెప్పారు.

తాను విలన్‌ను స్వామి వారితో పోల్చుతూ డైలాగ్ రాయలేదని.. అది ఆశువుగా వచ్చేసిందని.. అంతేకానీ.. తాను స్వామి వారిని కించపరచలేదని.. ఒకవేళ ఎవరి మనోభావాలు అయినా దెబ్బ తిని ఉంటే.. అందుకు క్షమాపణలు చెబుతున్నానని.. పరశురామ్ అన్నారు. తాను సినిమా విడుదలకు ముందు, తరువాత సింహాచలం నరసింహ స్వామిని దర్శించుకున్నానని తెలిపారు. కాగా సర్కారు వారి పాట సినిమాలో మహేష్ పక్కన కీర్తి సురేష్ నటించగా.. ఈ మూవీకి థమన్ సంగీతం అందించారు.