Theatres : గోటి చుట్టుకు రోకలి పోటులా మారింది ఏపీలో సినిమా థియేటర్ల పరిస్థితి. ఇప్పటికే టిక్కెట్ల ధరల తగ్గింపుతో భారీగా నష్టాలను ఎదుర్కొంటున్న థియేటర్ల యాజమాన్యాలకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. కరోనా నేపథ్యంలో థియేటర్లలో ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. థియేటర్ల యాజమాన్యాలు తప్పనిసరిగా ఈ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం దేశంలో కరోనా మూడో వేవ్ నడుస్తున్న విషయం విదితమే. అందులో భాగంగానే గత 2 రోజుల నుంచి రోజుకు 1.50 లక్షలకు పైగా దేశంలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. వాటిల్లో అధిక భాగం ఒమిక్రాన్ వేరియెంట్‌కు చెందినవే కావడం గమనార్హం. ఈ క్రమంలోనే అనేక రాష్ట్రాలు ఇప్పటికే కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి.
ఏపీలో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూను విధించి అమలు చేస్తున్నారు. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఇక తాజాగా థియేటర్లలో ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించారు. దీంతో థియేటర్ల యాజమాన్యాలకు మరిన్ని కష్టాలు రానున్నాయి. అయితే దీని ప్రభావం సంక్రాంతికి విడుదల కానున్న చిత్రాలపై పడుతుందని అంచనా వేస్తున్నారు. బంగార్రాజు, రౌడీ బాయ్స్, హీరో, సూపర్ మచ్చి వంటి చిత్రాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి. తాజా ఆంక్షల నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాతలు ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది.