NTR : చంద్రబాబుని అసెంబ్లీలో అవమానించడమే కాక ఆయన భార్య గురించి తప్పుగా మాట్లాడడంతో చంద్రబాబు మీడియా సమావేశంలో కన్నీరు పెట్టారు. దీనిపై తెలుగు తమ్ముళ్లు, నందమూరి ఫ్యామిలీ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. రాజకీయం రాజకీయ నేతల మధ్య ఉండాలి. ఫ్యామిలీ మధ్య కాదు. చట్టసభల్లో ఉండి ఇలాంటి మాటలా అసెంబ్లీలో ఉన్నారా. గొడ్ల చావిడిలో ఉన్నారా.. అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు బాలయ్య.
ఇక తాజాగా ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ద్వారా వీడియోతో స్పందించారు. ‘మాట.. మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సర్వసాధారణం. అవన్నీ ప్రజాసమస్యలపై జరగాలి కానీ వ్యక్తిగత దూషణలు, విమర్శలు ఉండకూడదు. నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఒక సంఘటన నా మనసును కలిచివేసింది. ఎప్పుడైతే మనం ప్రజాసమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నామో. ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడుతున్నామో అది ఒక అరాచక పాలనకు నాంది పలుకుతుంది. అది తప్పు’ అని ఎన్టీఆర్ చెప్పారు.
https://twitter.com/tarak9999/status/1461999392764792832
‘స్త్రీ జాతిని గౌరవించడమనేది, మన ఆడపడచులను గౌరవించడమనేది మన సంస్కృతి. మన నవనాడుల్లో, జవజీవాల్లో, రక్తంలో ఇమిడిపోయినటువంటి సంప్రదాయం. అలాంటి సంప్రదాయాలను రాబోయే తరాలకు జాగ్రత్తగా, భద్రంగా అప్పజెప్పాలి. అంతేకానీ దాన్ని కాల్చేసి రాబోయే తరానికి బంగారు బాట వేస్తున్నామనుకుంటే అది చాలా పెద్ద తప్పు’ .‘ఈ మాటలు వ్యక్తిగత దూషణలకు గురైన బాధిత కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడటం లేదు.
ఒక కొడుకుగా, భర్తగా, తండ్రిగా, దేశపౌరుడిగా, ఒక తెలుగువాడిగా మాట్లాడుతున్నాను. రాజకీయ నాయకులందరికీ ఒకటే విన్నపం చేస్తున్నా. దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి. ప్రజా సమస్యలపై పోరాడండి. రాబోయే తరానికి బంగారు బాట వేసేలాగా మన నడవడిక ఉండేలా జాగ్రత్తపడండి. ఇదే నా విన్నపం. ఇది ఇక్కడితో ఆగిపోతుందని కోరుకుంటున్నాను‘ అంటూ ఎన్టీఆర్ వీడియో సందేశం ఇచ్చారు.