NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలెంట్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన తన తాత పేరు నిలబెడుతూ స్టార్ హీరోగా ఎదుగుతూ అభిమానుల అంచనాలకు తగ్గకుండా తన నటనతో వారిని ఆనందింపజేస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్‌గా కొనసాగుతున్నాడు. ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఆర్ఆర్ఆర్‌లో ప్రత్యేకించి ఎన్టీఆర్ యాక్టింగ్ కి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఆర్ఆర్ఆర్ సక్సెస్ ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతున్న నేపథ్యంలో హిందీ మీడియాతో చిట్ చాట్ చేశాడు ఎన్టీఆర్. ఈ చిట్‌చాట్‌లో తారక్‌ను పొలిటికల్ ఎంట్రీ గురించి ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు.

ఇంటర్వ్యూలో యాంకర్ మాట్లాడుతూ.. మీరు ఆర్ఆర్ఆర్ లో కొమరం భీం పాత్రలో నటించారు. కొమరం భీమ్ సోషల్ రిఫార్మర్ మాత్రమే కాదు రెబల్ లీడర్ కూడా. తన ప్రజల కోసం ఏమైనా చేసేందుకు కొమరం భీమ్ సిద్ధపడ్డారు. ఆ కోణంలో చూసుకుంటే మీరు కూడా యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావాలనుకుంటున్నారా ? అని ఎన్టీఆర్ ని ప్రశ్నించారు. ఈ క్రమంలో యాక్టివ్ పాలిటిక్స్ గురించి మొట్టమొదటిసారి నోరువిప్పాడు. నేను ప్రస్తుతం నా జీవితంలో చాలా చాలా సంతోషకరమైన దశలో ఉన్నాను. ఒక యాక్టర్ గా ఈ ప్రయాణాన్ని ఆస్వాదించడం ప్రారంభించాను. నేను మొదట నుంచి దానికే కట్టుబడి ఉండాలనుకుంటున్నాను.
ఫ్యూచర్ అంటే ఐదేళ్లు తర్వాత, పదేళ్ల తరువాత ఉందని అనుకొనే మనిషిని కాను.. భవిష్యత్ అంటే నా నెక్స్ట్ సెకన్ ఏంటి అనేది ఆలోచించే మనిషిని. ప్రస్తుతం ఈ క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. నటుడిగా చాలా సంతోషంగా ఉన్నాను. యాక్టింగ్ అనేది నాకు ఎనలేని సంతృప్తినిచ్చే పని. నేను అందులోనే ఉండాలనుకుంటున్నాను.. అని చెప్పుకొచ్చాడు. దీంతో మరోసారి అభిమానులకు నిరాశే ఎదురైంది. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇప్పట్లో లేదని అర్ధమవుతోంది.