Nidhi Agarwal : సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. అనంతరం ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటించి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఎంతో పాపులారిటీ దక్కించుకున్న నిధి అగర్వాల్ తమిళంలో సినిమా అవకాశాలను కూడా అందుకొని ప్రస్తుతం ఎంతో బిజీగా ఉంది. ఇక నిధి అగర్వాల్ గత కొద్దికాలం నుంచి తమిళ హీరో శింబుతో ప్రేమలో ఉందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఈ ముద్దుగుమ్మ అలాంటిదేమీ లేదని కొట్టి పారేసింది.

కానీ కోలీవుడ్ సమాచారం ప్రకారం.. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, ఇద్దరు కూడా కుటుంబ సభ్యులను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వీరి పెద్దలు కనుక ఒప్పుకుంటే త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్దంగా ఉందని తెలుస్తోంది. శింబు, నిధి అగర్వాల్ లు ఈశ్వరన్ సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తోంది.
ప్రస్తుతం నిధి అగర్వాల్ చెన్నైలోని టి.నగర్ లోని శింబు ఇంటికి మకాం మార్చిందని.. ఇద్దరూ కలిసి పెద్దలను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. ఇలా గుట్టుగా ఎవరికి తెలియకుండా హీరోతో ప్రేమయానం చేస్తూ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారట. అంతా సవ్యంగా జరిగితే ఈ ఏడాది ఈ జంట పెళ్లి పీటలు ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం నిధి అగర్వాల్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో పవన్ కల్యాణ్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.