Naga Babu : మా’ ఎలక్షన్స్ లో ఎప్పుడూ లేనంతగా ఈసారి రికార్డు పోలింగ్ నమోదు అయ్యింది. ప్రకాశ్ రాజ్ – మంచు విష్ణు మధ్య పోటీ జరిగినా కూడా మెగా ఫ్యామిలీ వర్సెస్ మంచు ఫ్యామిలీగానే చూశారు. అయితే ప్రకాశ్ రాజ్ మ్యానిఫెస్టో కూడా విడుదల చేయకుండా గెలుపుపై తన ధీమా వ్యక్తం చేశాడు. మంచు విష్ణుపై 107 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు.
గత ‘మా’ ఎన్నికల్లో 474 ఓట్లు మాత్రమే నమోదు కాగా, ఈ సారి 665 (883 ఓట్లకు గాను..70 శాతానికి పైగా) ఓట్లు పోల్ అయ్యాయి. పోలైన ఓట్లలో 52 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు. అయితే ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల వరకే పోలింగ్‌కు అనుమతి ఉన్నప్పటికీ రెండు ప్యానల్స్ అభ్యర్థుల అభ్యర్థన మేరకు పోలింగ్ సమయాన్ని మరో గంట పొడగించారు. ఎప్పుడూ లేనట్లుగా ‘మా’లో భాగమైన సభ్యులు ఇతర రాష్ట్రాల (ముంబై, చెన్నై, కర్ణాటక) నుంచి కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రకాశ్ రాజ్‌కి మొదటి నుండి మద్దతుగా ఉంటూ తనని విమర్శించే వారికి నాగబాబు ఎన్‌కౌంటర్ చేస్తూ వచ్చాడు. మంచు విష్ణు, ఆయన ఫ్యామిలీపై కూడా నాగబాబు నోరు జారిన సందర్భాలు ఉన్నాయి. కానీ వారు చాలా సున్నితంగా స్పందిస్తూ వచ్చారు. మా ఎన్నికలలో ప్రకాశ్ రాజ్ ఓడిపోవడంతో నాగ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అయితే ప్రకాష్ రాజ్‌కు ముందునుంచీ మద్దతుగా నిలిచిన మెగా బ్రదర్ నాగబాబు.. మా ఎన్నికలకు సరిగ్గా ఒక్క రోజు ముందు ఓ టీవీ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు.. టాలీవుడ్ లో రచ్చ లేపాయని చెప్పొచ్చు. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమై.. నేరుగా ప్రకాష్ రాజ్ కు పడిన ఓట్లపై ప్రభావం చూపాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మంచు విష్ణును ఉద్దేశించి కూడా నాగబాబు చేసిన విమర్శలు.. ప్రకాష్ రాజ్ కు మంచి కంటే చెడునే ఎక్కువగా చేశాయని కొందరు భావిస్తున్నారు. ఏదేమైనా మా ఎన్నికలలో నాగబాబు పాచికలు పారలేదని, ఆయన చేసిన వ్యాఖ్యలు.. అసలుకే ఎసరు తెచ్చాయని అంటున్నారు.