Mahesh Babu : కరోనా నేపథ్యంలో థియేటర్లు తెరుచుకునేందుకు.. తెరుచుకున్నా నడిచేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నిర్మాతలు గత్యంతరం లేక ఎంతో కొంత మొత్తానికి తమ సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫాంలకు అమ్ముకుంటున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అనేక భాషలకు చెందిన సినిమాలు గత ఏడాదిన్నర కాలంగా ఓటీటీల్లోనే ఎక్కువగా విడుదలయ్యాయి.
ఇక టాలీవుడ్, బాలీవుడ్‌లలోనూ కొందరు ప్రముఖ నటుల సినిమాలు ఓటీటీల్లోనే విడుదలయ్యాయి. దీంతో థియేటర్లకు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఆయన తాజాగా మాట్లాడుతూ.. థియేటర్లు లేని ప్రపంచాన్ని ఊహించుకోలేమన్నారు. మొబైల్ ఫోన్ల కన్నా థియేటర్లలోనే సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తామని తెలిపారు.
ఇక తన సినిమాలను ఓటీటీల్లో విడుదల చేసేది లేదని, థియేటర్లలోనే విడుదల చేస్తానని మహేష్ బాబు స్పష్టం చేశారు. ఓటీటీ ప్రత్యేక మాధ్యమం అని.. థియేటర్లు ఇప్పుడు కష్టకాలం ఎదుర్కొంటున్నా.. ఓటీటీలతో వాటికి సమస్య రాదని.. మహేష్ అన్నారు.
కాగా మహేష్ బాబు త్వరలో సర్కారు వారి పాట ద్వారా అలరించనున్నారు. ఈ మూవీకి చెందిన టీజర్, పోస్టర్స్ ఇప్పటికే అభిమానులలో అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుగా విడుదల చేయనున్నారు. దీనికి పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా.. ఈ మూవీకి ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.