Macherla Niyojakavargam : మాచర్ల నియోజకవర్గం చిత్రంతో ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నితిన్. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో నితిన్ సరసన హీరోయిన్స్ గా కృతి శెట్టి, కేథరిన్ ట్రెసా నటించారు. మాచర్ల నియోజకవర్గం చిత్రం ద్వారా దర్శకుడు రాజశేఖర్ రెడ్డి తెలుగు తెరకు పరిచయమయ్యారు. రాను రానంటూనే చిన్నదో పాటలో అంజలి గెస్ట్ రోల్ లో ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ పాట సోషల్ మీడియాలో దుమ్ము లేపింది. ప్రేక్షకుల్లో ఈ పాటకు వచ్చినంత ఆదరణ చిత్రానికి రాలేదనే చెప్పవచ్చు. మాచర్ల నియోజకవర్గం మొదటిరోజు ఫస్ట్ షోకే ప్రేక్షకుల నుంచి నెగెటివ్ టాక్ ను మూటగట్టుకుంది. గతకొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న నితిన్ కి ఈ చిత్రం కూడా నిరాశనే మిగిల్చింది. సినిమా పక్కా రొటీన్ గా ఉంది అంటూ నెగెటివ్ కామెంట్స్ వినబడడంతో రివ్యూలు కూడా దారుణంగా వచ్చిపడ్డాయి.

విడుదల కాక ముందు నుంచి మాచర్ల నియోజకవర్గం వివాదాల్లో ఇరుక్కుంది. దర్శకుడు రాజశేఖర్ రెడ్డి చేసిన ఒక ట్వీట్ రెండు కులాలను అవమానించే విధంగా ఉంది అంటూ కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇదంతా తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం అంటూ దర్శకుడు రాజశేఖర్ రెడ్డి కూడా సైబర్ పోలీసులను ఆశ్రయించారు.
ఏది ఏమైనప్పటికీ ఈ చిత్రం నెగెటివ్ టాక్ మూటగట్టుకుని డిజాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో త్వరలో ఓటీటీలో రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మాచర్ల నియోజకవర్గం హక్కులను ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 9న అమెజాన్ లో ఈ మూవీ రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలో వస్తుండడంతో అందరూ షాకవుతున్నారు. ఇక ఓటీటీలో అయినా సక్సెస్ అవుతుందో.. లేదో.. చూడాలి.