Macherla Niyojakavargam Review : వరుసగా ఫ్లాప్‌లను ఎదుర్కొంటున్న యంగ్ హీరో నితిన్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన నటించిన మాచర్ల నియోజకవర్గం మూవీ శుక్రవారం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో నితిన్ కు జోడీగా యంగ్ బ్యూటీ కృతిశెట్టి నటించింది. సముద్రఖని మరో కీలకపాత్రలో నటించారు. అయితే ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ ఎలా ఉంది.. ప్రేక్షకులను ఆకట్టుకుందా.. కథ ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కథ..
మాచర్ల నియోజకవర్గాన్ని రాజప్ప (సముద్రఖని) ఏకఛత్రాధిపత్యంగా ఎన్నో ఏళ్ల నుంచి పాలిస్తుంటాడు. ప్రతిపక్షం అన్నదే లేకుండా ప్రతి సారి ఎన్నికను ఏకగ్రీవం చేస్తుంటాడు. ఎవరినీ అక్కడ పోటీ చేయనివ్వడు. దీంతో అతనే ఏకగ్రీవంగా ఎన్నికవుతూ ఉంటాడు. ఇలా ఎన్నో ఏళ్ల నుంచి రాజప్ప కబంధ హస్తాల్లో మాచర్ల నియోజకవర్గం నలిగిపోతుంటుంది. అక్కడి ప్రజలు ఎన్నో కష్టాలు పడుతుంటారు. అయితే సిద్ధు (నితిన్) అనే ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ అక్కడకు బదిలీ మీద వస్తాడు. తరువాత రాజప్పను అతను ఎలా ఎదుర్కొన్నాడు ? ఎలక్షన్లను ఎలా నిర్వహించాడు ? రాజప్పకు చెక్ ఎలా పెట్టాడు ? అతనికి, స్వాతి (కృతి శెట్టి)కి ఏమిటి సంబంధం ? ఆమె గతం ఏమిటి ? మెయిన్ స్టోరీకి, ఆమెకు సంబంధం ఏమిటి ? అన్న వివరాలను తెలుసుకోవాలంటే.. చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

విశ్లేషణ..
మాచర్ల నియోజకవర్గం మూవీ ద్వారా నితిన్ మరోసారి ఊర మాస్ క్యారెక్టర్‌లో కనిపించి సందడి చేశాడు. ఆయన యాక్టింగ్, డ్రెస్సింగ్ స్టైల్ అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. ప్రభుత్వ అధికారి పాత్రలో ఒదిగి పోయాడని చెప్పవచ్చు. అలాగే నితిన్ చెప్పే భారీ డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఇక కృతిశెట్టి కూడా యాక్టింగ్ బాగానే చేసింది. మరో కీలకపాత్రలో నటించిన క్యాథరిన్ ట్రెసా తన పాత్రకు న్యాయం చేసింది. ఇక సముద్రఖని, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మాజీ, మురళీ శర్మ, శుభలేఖ సుధాకర్ వంటి వారు తమ పాత్రల పరిధుల మేర బాగానే నటించారు.
ఈ చిత్రానికి స్వర సాగర్ అందించిన సంగీతం బాగుంటుంది. రాను రాను సాంగ్ ఆకట్టుకుంటుంది. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. కోటగిరి వెంకటేశ్వర్ రావు ఎడిటింగ్ ఫర్వాలేదనిపించారు. యాక్షన్ కొరియోగ్రఫీని కూడా బాగానే తీర్చిదిద్దారు. అయితే చిత్రంలో అనేక ఆకట్టుకునే సీన్లు ఉన్నా.. పాథ కథ కావడం, ఫస్టాఫ్ అంతగా ఆకట్టుకోకపోవడం, కామెడీ మరీ ఎక్కువ కావడం వంటివి మైనస్ పాయింట్లుగా చెప్పవచ్చు. అయినప్పటికీ మూవీలోని జాతర ఫైట్, నితిన్ డైలాగ్స్, కొన్ని చోట్ల కామెడీ సీన్లు, రాను రాను సాంగ్ ఆకట్టుకుంటాయి. కనుక కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్‌ను కోరుకునే వారు ఈ మూవీని ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.