Krishnam Raju : టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. రెబల్‌స్టార్ కృష్ణం రాజు (83) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున 3:25 గంటలకు కృష్ణం రాజు మరణించారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది.
కాగా కృష్ణంరాజు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు.1940 జనవరి 20న జన్మించారు. కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలు. ఆయన 183కు పైగా చిత్రాలలో నటించారు. కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన కృష్ణంరాజు వాజ్‌పేయ్ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. అలాగే 2004లో లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చెందిన కృష్ణంరాజు.. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 1966లో చిలకా గోరింక చిత్రంతో సినీ ఎంట్రీ ఇచ్చారు. రెబల్‌స్టార్‌గా కృష్ణంరాజుకు సినీ ఇండస్ట్రీలో మంచి పేరుంది.

హీరోగా సినీ రంగ ప్రవేశం చేసి విలన్‌గానూ అలరించారు. కృష్ణంరాజు కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్‌ను ఏలారు. కాగా సోమవారం హైదరాబాద్‌లో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. 1977,1984లో నంది అవార్డును గెలుచుకున్నారు. 1988లో తాండ్రపాపారాయుడు చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. కృష్ణంరాజు సొంతపేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు కాగా తెలుగు సినిమా కథానాయకుడిగా, నిర్మాతగా, రాజకీయవేత్తగా వెలుగు వెలిగిన కృష్ణంరాజు తుదిశ్వాస విడవడం అందరినీ కలచి వేస్తోంది. ఇక ఈ విషయం తెలియగానే ప్రభాస్ హుటాహుటిన ఏఐజీ ఆస్పత్రికి చేరుకున్నారు.
కృష్ణం రాజు మొదటి భార్య సీతాదేవి కన్నుమూశారు. దీంతో 1996లో శ్యామలా దేవిని ఆయన రెండో వివాహం చేసుకున్నారు. అమరదీపం, భక్త కన్నప్ప వంటి చిత్రాలు ఆయనకు గొప్ప నటుడిగా పేరు తెచ్చిపెట్టాయి. కాగా కృష్ణం రాజు ప్రభాస్‌కు పెదనాన్న అవుతారు. ఆయన బిరుదు రెబల్ స్టార్‌తోనే ప్రభాస్ ప్రస్తుతం సినిమాల్లో కొనసాగుతున్నారు. అయితే ప్రభాస్ పెళ్లి చూడాలనేది ఆయన కోరిక. అది తీరకుండానే ఆయన వెళ్లిపోయారు.