Kota Srinivasa Rao : టాలీవుడ్ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. కమెడియన్, విలన్‌గా అద్భుతమైన నటవిన్యాసం ప్రదర్శిస్తూ భళా అనిపించారు. ఇప్పటికీ ఆయన సినిమాలలో నటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే పలు ఇంటర్వ్యూలలో కోట చెబుతున్న కొన్ని షాకింగ్ విషయాలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. తాజాగా తనకు కడుపుకోత మిగిల్చిన కొడుకు చావును గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు కోట.
ఇండస్ట్రీలో కొత్త నటీనటులు నిలదొక్కుకోవాలంటే అప్పటికే అనుభవం ఉన్న వారి ప్రోత్సాహం చాలా అవసరం. అందుకే మా అబ్బాయిని ప్రోత్సహించి ధైర్యం చెప్పే బాధ్యత జె.డి. చక్రవర్తి, జగపతి బాబు తీసుకున్నారు. మా అబ్బాయి ఆంజనేయ ప్రసాద్ ‘గాయం- 2’ సినిమాలో నా కొడుకు వేషం వేశాడు. ఓ రోజు షూటింగ్ స్పాట్‌లో సీన్ కోసం సెటప్ చేస్తున్నారు. ఆ సీన్‌లో మా అబ్బాయిని జగపతి బాబు చంపేస్తాడు. ఆ తర్వాత పాడె ఎక్కిస్తారు.
అందుకోసం పాడె సిద్ధం చేస్తుండగా, నేను వెళ్లాను. అది సినిమా షూటింగ్ అని తెలిసినా తట్టుకోలేకపోయాను. మా అబ్బాయిని అలా పాడె మీద చూడలేనయ్యా. తలచుకుంటేనే కాస్త వణుకు వచ్చేస్తోంది. కాస్త అవాయిడ్ చేయండి. వాడిని అలా చూస్తే నేను చేయలేనండీ అన్నా. జగపతిబాబు ఒక్క క్షణం ఆలోచించి ‘మరేం ఫర్లేదు కోట గారు.. మీరు రిలాక్స్ అవండి. ఆ సీన్‌లో అక్కడ మీ అబ్బాయి బదులు డూప్‌ని పెడదాం. మీ ఫీలింగ్ నాకు అర్థమైంది’ అన్నారు. ఏ ముహూర్తాన ఆ మాట అన్నానో గానీ వారం రోజుల్లో నా కొడుకు పోయాడు. వాడు బైక్ మీద వెళ్తుంటే, సడెన్‌గా యాక్సిడెంట్ జరిగింది. మాకు కడుపుకోత మిగిల్చి మా వాడు కన్నుమూశాడు.. అంటూ కోట చాలా ఎమోషనల్ అయ్యారు.