Karthika Pournami : హిందువులు ఎంతో పవిత్రంగా భావించే మాసాలలో కార్తీక మాసం ఒకటి .కార్తీకమాసంలో భక్తులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలలో ఆ భగవంతుని సేవలో మునిగి పోతారు. అలాగే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అని, త్రిపుర పౌర్ణమి అని.. భావించి పెద్ద ఎత్తున ఆ రోజు భక్తులు పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. కార్తీక పౌర్ణమి రోజున ఒక పండుగగా భావించి చాలామంది ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజు పరమేశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించడం వల్ల ఈ పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని కూడా జరుపుకుంటారు. ఇక పౌర్ణమి రోజు శివుడికి, శ్రీహరికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు కలిగిన దీపాన్ని వెలిగించడం వల్ల ఏడాది మొత్తం దీపం వెలిగించిన పుణ్యఫలం లభిస్తుందని భావిస్తారు. ఈ క్రమంలోనే కార్తీక పౌర్ణమి రోజు శివ కేశవాలయాలు భక్తులతో మారుమోగి పోతుంటాయి.
ఇక ఈ ఏడాది కార్తీక పౌర్ణమి ఎప్పుడు.. కార్తీక పౌర్ణమి పూజ చేయడానికి సరైన సమయం ఏది.. అనే విషయానికి వస్తే.. ఈ ఏడాది నవంబర్ 19న కార్తీక పౌర్ణమి జరుపుకోనున్నారు. నవంబర్ 18 (గురువారం) రాత్రి 11.55 నుంచి 19 శుక్రవారం మధ్యాహ్నం 02.25 కు తిథి ముగుస్తుంది.
ఆరోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి గంగా జలాలతో స్నానాలు ఆచరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలి. నెయ్యితో విష్ణుమూర్తికి తులసి కోట ముందు దీపారాధన చేయటం వల్ల ఎన్నో శుభఫలితాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. అలాగే పౌర్ణమి రోజు స్వామివారికి పాయసం నైవేద్యం సమర్పించాలి. దీంతో అన్నీ శుభాలే కలుగుతాయి.