Fish : సాధారణంగా వేటకు వెళ్లే మత్స్యకారులకు కొన్నిసార్లు ఎంతో అరుదైన, ఖరీదైన చేపలు వలలో చిక్కుతుంటాయి. ఇలా ఖరీదైన చేపలు పడినప్పుడు ఒక్కసారిగా మత్స్యకారులు లక్షాధికారులు అవుతారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మత్స్యకారుడు కూడా ఇలాగే లక్షాధికారిగా మారిపోయాడు. తూర్పుగోదావరి జిల్లా పల్లిపాలెం చేపల రేవులో 25 కేజీలున్న మగ కచ్చిడి చేప లభించడంతో దానిని వేలంలో పెట్టారు.

ఈ క్రమంలోనే బంగారు వర్ణంతో ఉన్నటువంటి ఈ కచ్చిడి చేపను బంగారు చేప అని కూడా పిలుస్తారు. ఈ విధంగా బంగారు వర్ణంతో ఉన్న 25 కిలోల చేపను ఏకంగా రూ.2.90 లక్షలకి ఓ పాట దారుడు దక్కించుకున్నాడు. ఇంత ఖరీదు చేసే ఈ చేప ప్రత్యేకతలు ఏమిటి అనే విషయానికి వస్తే..
ఈ చేపలలో ఎన్నో పోషకాలు ఉండటం వల్ల బలం కోసం ఉపయోగించే మందుల తయారీలో వీటిని ఉపయోగిస్తారు. అదే విధంగా గాల్ బ్లాడర్ కు ఆపరేషన్ చేసే సమయంలో కుట్లు వేయడం కోసం ఉపయోగించే దారం తయారీలోనూ ఈ చేపను ఉపయోగిస్తారు. అదేవిధంగా ఖరీదైన వైన్ తయారు చేసే సమయంలో ఈ చేపలోని పలు భాగాలను ఉపయోగించడం వల్ల ఈ చేపకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. అందుకనే ఈ చేప అంతటి ధర పలికింది.