భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. రోజుకు 3 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక సుప్రీం కోర్టు దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ నెలకొందని వ్యాఖ్యలు చేసింది. దీన్ని బట్టే సులభంగా అర్థం చేసుకోవచ్చు, దేశంలో కోవిడ్ పరిస్థితి ఎలా ఉందో. అయితే మన దేశంలో ఉన్న పరిస్థితిని చూసి పలు ఇతర దేశాలు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. మన దాయాది దేశమైన పాకిస్థాన్ కూడా మనకు సహాయం చేస్తామని ప్రకటించింది.
పాకిస్థాన్ ప్రధాని భారత్‌కు కావల్సిన సహాయం చేస్తామని ఇదివరకే ప్రకటించారు. అందులో భాగంగానే ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మహమ్మద్ ఖురేషి ఇండియాకు సహాయం చేస్తామని ట్వీట్ చేశారు. భారత్‌కు తక్షణమే వెంటిలేటర్లు, డిజిటల్ ఎక్స్‌రే యంత్రాలు, పీపీఈ కిట్లు, ఇతర వైద్య సామగ్రిని అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అయితే దీనిపై భారత్ స్పందించాల్సి ఉంది.
As a gesture of solidarity with the people of India in the wake of the current wave of #COVID19, Pakistan has officially offered relief & support to #India, including ventilators, Bi PAP, digital X ray machines, PPEs & other related items. We believe in a policy of #HumanityFirst
— Shah Mahmood Qureshi (@SMQureshiPTI) April 24, 2021
ఈ సందర్బంగా ఖురేషీ మాట్లాడుతూ.. భారత్‌లో కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. కరోనాతో తీవ్రంగా పోరాటం చేస్తున్న భారత్‌కు సంఘీభావం తెలుపుతున్నాం. భారత్‌కు అవసరమైన వైద్య సామగ్రి, ఆధునిక యంత్రాలను పంపిస్తాం. ఇందుకు ఇరు దేశాలకు చెందిన అధికారులు కృషి చేయాలి.. అని అన్నారు.