కోవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి నుంచి దేశంలో టీకాలను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మన దేశంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థకు చెందిన కోవిషీల్డ్ టీకాతోపాటు భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్‌ను పంపిణీ చేస్తున్నారు. అలాగే రష్యాకు చెందిన స్పుత్‌నిక్-వి టీకాను కూడా కొన్ని చోట్ల ఇస్తున్నారు. అయితే కోవిడ్ టీకాల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
భారత్‌తోపాటు పలు ఆఫ్రికా దేశాల్లో నకిలీ కోవిషీల్డ్ వ్యాక్సిన్లు చెలామణీ అవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక ఈ విషయాన్ని కోవిషీల్డ్ ఉత్పత్తిదారు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా ధ్రువీకరించింది. మన దేశంలో కోవిషీల్డ్ టీకాలను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ సంస్థ వాటిని పలు ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది.
కోవిషీల్డ్ టీకాలు ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అయితే ఈ టీకాలకు నకిలీలు వస్తుండడం ఆందోళన కలిగిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. కనుక టీకాలను ఎక్కడ పడితే అక్కడ వేయించుకోకూడదని, గుర్తింపు పొందిన ప్రైవేటు హాస్పిటళ్లకు చెందిన కేంద్రాలతోపాటు ప్రభుత్వ కేంద్రాల్లోనే టీకాలను వేయించుకోవాలని సూచిస్తున్నారు.