అడవుల్లో సంచరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటు నుంచి ఏ వన్యప్రాణి సైలెంట్‌గా వచ్చి అటాక్ చేస్తుందో తెలియదు. అందువల్ల చాలా జాగ్రత్తగా అడవుల్లో తిరగాల్సి ఉంటుంది. ఇక అడవుల్లో విహరించేందుకు వచ్చిన ఓ జంటకు దారుణమైన పరిస్థితులు ఎదురయ్యాయి. రష్యాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
తూర్పు రష్యాలోని బన్నియె హాట్ స్ప్రింగ్స్‌లో విహరించేందుకు ఆంటన్, నీనా బోగ్డనోవ్ అనే ఇద్దరు దంపతులు వెళ్లారు. అయితే అక్కడి కంచక్ట అనే ప్రాంతంలో వారి ఎస్‌యూవీ బురదలో ఇరుక్కుంది. దీంతో దాన్ని వదిలి వారు అక్కడికి సమీపంలో ఉన్న టూరిస్టు బేస్ క్యాంప్ కు కాలి నడకనే ప్రయాణం అయ్యారు. తమ వాహనం స్టక్ అయిందని, వాము క్యాంప్‌కు వెళ్తున్నామని తమ కారుపై వారు రాసి అక్కడి నుంచి ప్రయాణం అయ్యారు.
అయితే వారి వెనుకే ఓ ఎలుగుబంటి వచ్చింది. చప్పుడు కాకుండా వారిని ఫాలో అయింది. కానీ వారు దాన్ని కనిపెట్టారు. దాని నుంచి తప్పించుకునేందుకు వారు కొంత సేపు వేగంగా పరిగెత్తారు. కానీ అది విడిచి పెట్టలేదు. దీంతో కర్రలు, బాటిల్స్ ను విసిరి తప్పించుకునే యత్నం చేశారు. అయినప్పటికీ ఆ ఎలుగు వారిని ఫాలో అయింది. దీంతో వారు గత్యంతరం లేక అక్కడే ఉన్న చెట్లను ఎక్కారు. ఒకరు మెళకువతో ఉంటే మరొకరు నిద్రించేవారు. తమ వద్ద కేవలం నీళ్లే ఉన్నాయి. ఆహారం లేదు. దీంతో వారు ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు మారుతూ 10 రోజుల పాటు చెట్ల మీదే గడిపారు. చివరకు ఎలుగు బంటి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో వారు తమ ఎస్‌యూవీ దగ్గరకు వెనక్కి వచ్చారు.
అయితే అప్పటికే అక్కడికి కొందరు టూరిస్టులు రావడంతో వారు బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి ఇంటికి వచ్చేశారు. అడవిలో విహరిద్దామని అలా వెళ్లిన ఆ దంపతులు నిద్రలేని రాత్రులు గడిపారు. ఆహారం లేకుండా బిక్కు బిక్కు మంటూ జీవించారు. ఎట్టకేలకు బయట పడడంతో ఊపిరి పీల్చుకున్నారు.