ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ చిక్కుల్లో పడిన విషయం విదితమే. అల్లోపతి వైద్యంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో వివాదంలో ఇరుక్కున్నారు. ఇంగ్లిష్ వైద్యం అంతా బూటకమని, కోవిడ్ చికిత్సకు అందిస్తున్న రెమ్‌డెసివిర్, ఫాబి ఫ్లూ వంటి మందులు కరోనాను నయం చేయడంలో విఫలం అయ్యాయని, ఇంగ్లిష్ వైద్యాన్ని నమ్మవద్దని ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) మండిపడింది.
బాబా రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్యలను ఐఎంఏ ఖండించింది. బాబా రామ్‌దేవ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని, ఆయన చేసిన వ్యాఖ్యలు దేశంలోని అల్లోపతి వైద్యుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీసేవిధంగా ఉన్నాయని, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, లేదంటే చట్ట పరంగా చర్యలు తీసుకునేందుకు తాము కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించింది. అంతటితో ఆగకుండా రామ్‌దేవ్ బాబాకు లీగల్ నోటీసులను కూడా పంపించారు.
అయితే ఈ విషయంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ స్పందించారు. బాబా రామ్‌దేవ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, ఆయన క్షమాపణలు చెబితే బాగుంటుందని అన్నారు. ఈ క్రమంలో బాబా రామ్‌దేవ్ దిగిరాక తప్పలేదు. ఈ విషయంపై క్షమాపణలు చెబుతూ ఆయన కేంద్ర ఆరోగ్య మంత్రికి లేఖ రాశారు. అలాగే ట్విట్టర్ ఖాతాలోనూ సారీ చెబుతున్నట్లు పోస్టు పెట్టారు. దీనిపై ఐఎంఏ స్పందించాల్సి ఉంది.